
India vs South Africa 2025: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇటీవల ముగిసిన క్రికెట్ సిరీస్ మైదానంలో ఆటతోనే కాకుండా కొన్ని వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాను ఉద్దేశించి టీమిండియా ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా ఈ ‘బౌనా’ (పొట్టివాడు అని అర్థం) వివాదంపై తెంబా బవుమా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కోల్‌కతా టెస్టు సందర్భంగా భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ హిందీలో మాట్లాడుకుంటూ బవుమాను ‘బౌనా’ అని పిలిచారు. బవుమా తక్కువ ఎత్తును ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్ ద్వారా బయటకు రావడంతో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది వ్యక్తిగత దూషణ కిందకు వస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఈ విషయంపై బవుమా స్పందిస్తూ.. “తొలి టెస్టు ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. వారు నా గురించి హిందీలో ఏదో అన్నారని నాకు అప్పటికి తెలియదు. వారు సారీ చెప్పినప్పుడు కూడా అసలు విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా మీడియా మేనేజర్‌ని అడిగి తెలుసుకున్నాను,” అని బవుమా వివరించారు.
మైదానంలో ఎంతటి పోటీ ఉన్నా, ఆట ముగిశాక గౌరవం ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. “మైదానంలో జరిగినవి అక్కడే వదిలేయాలి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు మనసులో ఎక్కడో ఒకచోట మిగిలిపోతాయి. వాటిని నేను కసిగా, మరింత మెరుగ్గా ఆడేందుకు ఇంధనంగా వాడుకుంటాను తప్ప, వారిపై ఎలాంటి పగ పెంచుకోను,” అని బవుమా పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశారు.
ఇదే పర్యటనలో దక్షిణాఫ్రికా కోచ్ శుక్రీ కాన్రాడ్ భారత జట్టును ‘మోకాళ్లపై నిలబెడతాం’ (Grovel) అని చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై బవుమా మాట్లాడుతూ.. “శుక్రీ ఆ పదాన్ని వాడకుండా ఉండాల్సింది. ఆ సమయంలో భారత మీడియా నుంచి నాకు చాలా ఒత్తిడి ఎదురైంది. ఆ తర్వాత శుక్రీ కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆ సిరీస్ ఎంత కఠినంగా సాగిందో చెప్పడానికి అదొక ఉదాహరణ మాత్రమే,” అని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో 25 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, వైట్ బాల్ సిరీస్‌లో పరాజయం పాలైంది. ఏదేమైనా, బుమ్రా, పంత్ తమ తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..