యూనిఫామ్‌లో ఉంటే DGP.. బ్యాట్ పడితే MSD.. సెంచరీతో సత్తా చాటిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ క్రికెట్‌లో అదరగొట్టారు. సికింద్రాబాద్‌ క్లబ్‌ తరఫున సి-డివిజన్ వన్డే లీగ్‌లో ఆడిన ఆయన 82 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగారు. బౌలింగ్‌లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

యూనిఫామ్‌లో ఉంటే DGP.. బ్యాట్ పడితే MSD.. సెంచరీతో సత్తా చాటిన సీవీ ఆనంద్
Telangana Dgp Cv Anand

Updated on: Aug 30, 2026 | 9:16 PM

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటారు. ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉంటే డీజీపీగా డ్యూటీ చేస్తున్నారు. బ్యాట్ పడితే మాత్రం ఎంఎస్‌డీ (మహేంద్ర సింగ్ ధోని)‌లా అదరగొడుతున్నారు. పోలీస్ బాధ్యతలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన సెంచరీ సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన సీవీ ఆనంద్ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

సికింద్రాబాద్ క్లబ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సీవీ ఆనంద్ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. కేవలం 82 బంతుల్లోనే 126 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆయన ఇన్నింగ్స్‌లో బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆయన అద్భుత ఇన్నింగ్స్‌తో సికింద్రాబాద్ క్లబ్ భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ సీవీ ఆనంద్ రాణించారు. దీంతో సికింద్రాబాద్ క్లబ్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఆయన సెంచరీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ లీగ్‌లో నమోదు చేసిన తొలి శతకంగా నిలిచింది.

సీవీ ఆనంద్‌కు క్రికెట్‌తో అనుబంధం కొత్తది కాదు. ఐపీఎస్‌లోకి రాకముందే ఆయన క్రికెట్‌లో చురుకుగా ఉండేవారు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన అండర్-22 స్థాయిలోనూ ఆడారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున గతంలోనూ పలు సెంచరీలు సాధించారు. 2025లో కూడా ఆయన వరుసగా సెంచరీలు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలపైనా ఆసక్తి ఉన్న సీవీ ఆనంద్.. టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడల్లోనూ పాల్గొంటూ తన ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా బ్యాట్‌తో మెరిసిన డీజీపీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us