Stuart Binny: భారత ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ నేడు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశాడు. భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడైన 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, క్రికెట్ వ్యాఖ్యత మయంతి లాంగర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, 14 వన్డేలు, మూడు టీ 20 లతో సహా మొత్తం 23 మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ దాదాపు 17 సంవత్సరాలు కొనసాగింది. అతను తన సొంత రాష్ట్రం కర్ణాటక తరపున 95 మ్యాచ్‌లలో భాగస్వామ్యం అయ్యాడు. 2013-14లో అతను 43.22 సగటుతో 443 పరుగులు, 32.64 వద్ద 14 వికెట్లు పడగొట్టాడు. కర్ణాటక రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంమీద, బిన్నీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ని 4796 పరుగులు, 146 వికెట్లతో ముగించాడు. దీంతో 2014 లో బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. మీర్పూర్‌లో జరిగిన రెండో వన్డేలో బిన్నీ టీమిండియా తరపున అత్యుత్తమ ప్రద్శరన చేశాడు. కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు.
2014 లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బిన్నీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో నిరాశపరిచినా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో కీలక పాత్ర పోషించాడు. 78 ఇన్నింగ్స్‌లతో టెస్ట్‌ను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా వన్డే స్క్వాడ్‌లో బిన్నీ రెగ్యులర్‌గా ఉన్నాడు. కానీ, అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. 2015లో వరల్డ్ కప్ బరిలోకి దిగాడు. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.స్టువర్ట్ బిన్నీ 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై ఒక ఓవర్‌లో 32 పరుగులు ఇచ్చి తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఆ తరువాత టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు.
2010లో ముంబై ఇండియన్స్‌తో బిన్నీ తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2011 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్ లైనప్‌లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. 2016 సీజన్‌కు ముందు జట్టు సస్పెన్షన్ తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగాడు.ఈ సందర్భంగా.. “అత్యున్నత అంతర్జాతీయ స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని బిన్నీ ఒక ప్రకటనలో తెలిపారు. “నా క్రికెట్ ప్రయాణంలో బీసీసీఐ పోషించిన ప్రముఖ పాత్రను నేను గుర్తించాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వారి మద్దతు, విశ్వాసం చూపించారు. కర్ణాటక మద్దతు లేకపోతే నా క్రికెట్ ప్రయాణం కూడా ప్రారంభమయ్యేది కాదు. నా రాష్ట్రం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం, అలాగే ట్రోఫీలు గెలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. నన్ను ప్రోత్సహించిన కోచ్‌లకు, నాపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లకు కృతజ్ఞతలు. క్రికెట్ నా రక్తంలోనే ఉంది. నా తదుపరి ఇన్నింగ్స్‌లో మీ నిరంతర మద్దతు అందించాలని కోరుకుంటున్నాను” అని బిన్నీ తెలిపాడు.