
Women’s ODI World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. తమ మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ డీఎల్‌ఎస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరించినా, భారత జట్టు పట్టుదలతో విజయం సాధించింది. భారత మహిళా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ, బౌలింగ్‌లో 3 వికెట్లతో చెలరేగిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 269 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో పలువురు బ్యాటర్లు కీలక పరుగులు సాధించారు. ప్రతికా రావల్ 37 పరుగులు, హర్లీన్ డియోల్ 48 పరుగులు, దీప్తి శర్మ 53 పరుగులతో కీలక హాఫ్ సెంచరీ సాధించింది. భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 120 పరుగుల వద్ద కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి, అమన్‌జోత్ కౌర్‌తో కలిసి 103 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అమన్జోత్ కౌర్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 56 బంతుల్లో 57 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది. స్నేహ్ రాణా 9వ స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా కేవలం 15 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, జట్టును 269 పరుగుల భారీ స్కోరుకు చేర్చింది.
భారత్ 269 పరుగులు చేసినప్పటికీ, వర్షం కారణంగా డీఎల్‌ఎస్ పద్ధతిని అమలు చేశారు. దీంతో శ్రీలంకకు 47 ఓవర్లలో 271 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేశారు. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 211 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక 6 వికెట్లు 140 పరుగులకే కోల్పోయినప్పటికీ, చివర్లో నిలాక్షి డి సిల్వా (35 పరుగులు) కొంత పోరాడింది. అయితే, స్నేహ్ రాణా ఆమెను క్లీన్ బౌల్డ్ చేసింది. కులసూర్య కూడా క్రీజులో నిలబడటానికి ప్రయత్నించినా, 17 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను ముగించింది.
భారత విజయంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 53 బంతుల్లో 53 పరుగులు, బౌలింగ్‌లో 9 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఆమె అద్భుతమైన ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ తరపున బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ అయినా తీయడం విశేషం. దీప్తి శర్మ 3 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు, శ్రీ చరణి 2 వికెట్లు, క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, ప్రతికా రావల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. సమిష్టి ఆటతీరుతో టీమిండియా వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..