
Abhishek Sharma 45 Sixes in Nets: భారత క్రికెట్‌లో ప్రస్తుతం సిక్సర్ల కింగ్ అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? ఇంకెవరు.. యువ సంచలనం అభిషేక్ శర్మ. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఈ పంజాబ్ కెప్టెన్, జైపూర్‌లోని ప్రాక్టీస్ సెషన్‌లో ఊహకందని విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది, ప్రత్యర్థి బౌలర్లకు ముందే ప్రమాద హెచ్చరికలు పంపాడు.
జైపూర్ శివార్లలోని ‘అనంతం క్రికెట్ గ్రౌండ్’లో ఆదివారం ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్, నెట్స్‌లో డిఫెన్స్‌ను పక్కన పెట్టి కేవలం అటాకింగ్ మీదనే దృష్టి పెట్టాడు.
ఈ ప్రత్యేక సెషన్‌లో అభిషేక్ కేవలం స్పిన్నర్లను (ఆఫ్-స్పిన్, లెగ్-స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్) ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూ, బంతి బాగా టర్న్ అవుతున్నప్పటికీ.. అభిషేక్ ఏమాత్రం తగ్గలేదు. బౌలర్లు బంతిని విసరడం ఆలస్యం, అది గాలిలో ప్రయాణించి బౌండరీ అవతల పడాల్సిందే. ఈ గంట కాలంలో అతను బాదిన 45 సిక్సర్లలో కొన్ని పక్కనే ఉన్న ఎత్తైన భవనాలపైకి కూడా వెళ్లడం విశేషం.
అభిషేక్ పదే పదే ‘ఇన్‌సైడ్-అవుట్’ షాట్లతో ఎక్స్‌ట్రా కవర్ మీదగా సిక్సర్లు కొట్టడం చూసి పంజాబ్ హెడ్ కోచ్ సందీప్ శర్మ ఆశ్చర్యపోయారు. “నువ్వు నీ సెంచరీని కేవలం ఎక్స్‌ట్రా కవర్ మీదగా సిక్సర్లు కొట్టి మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నావా?” అని కోచ్ సరదాగా వ్యాఖ్యానించాడు. తప్పుడు షాట్లను నియంత్రించడానికి ఎక్స్‌ట్రా కవర్ వద్ద నెట్ ఏర్పాటు చేసినప్పటికీ, అభిషేక్ దానిని అధిగమించి సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఈ సెషన్ చూస్తుంటే అభిషేక్ ఏ స్థాయిలో సిద్ధమయ్యాడో అర్థమవుతోంది. కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడం కాకుండా, బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే తన సహజ సిద్ధమైన ఆటగా మార్చుకున్నాడు. టీమిండియా అనుసరిస్తున్న ‘అటాకింగ్ క్రికెట్’ ఫిలాసఫీకి అభిషేక్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత అతను స్వయంగా బౌలింగ్ కూడా చేయడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..