
గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి టీమిండియా టెస్టుల్లో ఘోర పరాజయాలను చవి చూసింది. ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఘోర పరాజయం పాలవ్వగా.. గంభీర్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే భారత జట్టు టెస్టుల్లో ఓటమిపాలవుతోందని అంటున్నారు. టెస్టులకు కోచ్‌గా గంభీర్‌ను తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో భారత జట్టు స్వదేశంలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వడం ఇది రెండోసారి. అంతకముందు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమిపాలైంది. ఇన్ని ఓటములు చవిచూసినా.. బీసీసీఐ అధికారులు కోచ్‌కు మద్దతు ఇచ్చారు. అతడ్ని తొలగించమని చెప్పినప్పటికీ.. తెర వెనుక కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ఓటమి తర్వాత బీసీసీఐ పలు చర్చలు జరిపినట్టు పీటీఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం, బోర్డులోని కీలక సభ్యుడు టెస్ట్ జట్టు కోచ్ బాధ్యతల కోసం దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అనధికారికంగా చర్చించారట. గంభీర్‌ను కోచ్‌గా నియమించడానికి ముందే, బీసీసీఐ లక్ష్మణ్‌ను కోచ్‌గా చేయాలని చూసిందట. అయితే లక్ష్మణ్ దాన్ని సున్నితంగా తిరస్కరించి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉండాలని కోరుకున్నాడట.
లక్ష్మణ్ అవును అని చెప్పి ఉంటే, గంభీర్ స్థానంలో టెస్ట్ జట్టుకు కోచ్‌గా నియమించేవారా? అయితే ఇందుకు సమాధానం నో అనే చెప్పాలి. ఎందుకంటే బోర్డు ప్రస్తుతం గంభీర్‌ను మార్చే యోచనలో లేదు. 2026 T20 ప్రపంచకప్‌లో టీమిండియా విఫలమైతే, 2027 ప్రపంచకప్ వరకు గంభీర్ కొనసాగే ఛాన్స్ లేనట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికైతే గంభీర్‌కు బోర్డు మద్దతు పూర్తిగా ఉందని.. టీ20 ప్రపంచకప్ గెలిస్తే లేదా ఫైనల్‌కు చేరుకుంటే.. అతడి పదవి సేఫ్ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అప్పుడు టెస్ట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపడతాడా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కాగా, టీమిండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఆగష్టు 2026లో ప్రారంభం కానుంది.