
Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దేనిని తాకినా అది బంగారమే అవుతుంది. అయితే, తాజాగా కోహ్లీ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఆర్థిక నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్యూమా ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ, ఆ బంధానికి స్వస్తి పలికారు.
ప్యూమా సంస్థ కోహ్లీతో తన ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి దాదాపు రూ. 300 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ భారీ మొత్తాన్ని కోహ్లీ సున్నితంగా తిరస్కరించారు. విదేశీ బ్రాండ్‌ల కంటే స్వదేశీ బ్రాండ్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్యూమా నుంచి తప్పుకున్న వెంటనే, కోహ్లీ భారతీయ స్పోర్ట్స్‌వేర్ స్టార్టప్ అయిన ‘అజిలిటాస్ స్పోర్ట్స్’ (Agilitas Sports) లో పెట్టుబడిదారుగా చేరారు. ఈ సంస్థ విలువ ప్రస్తుతం సుమారు రూ. 2,058 కోట్లు. ప్యూమా ఇండియా మాజీ ఎండీ అభిషేక్ గంగూలీ ప్రారంభించిన ఈ సంస్థ, క్రీడా సాగ్రి, పాదరక్షల తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్వదేశీ బ్రాండ్‌కు మద్దతు: ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడం.
వ్యాపార భాగస్వామ్యం: కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం కంటే, సంస్థలో వాటాను కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని కోహ్లీ భావిస్తున్నారు.
క్రీడా రంగంపై పట్టు: అజిలిటాస్ సంస్థ కేవలం షూస్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని మార్చే ప్రణాళికతో ఉండటం కోహ్లీని ఆకర్షించింది.
వ్యాపారవేత్తగా కోహ్లీ సామ్రాజ్యం: విరాట్ కోహ్లీకి ఇప్పటికే ‘వన్8’ (one8), ‘రాంగ్’ (Wrogn) వంటి విజయవంతమైన బ్రాండ్‌లు ఉన్నాయి. ఇప్పుడు అజిలిటాస్‌లో చేరడం ద్వారా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. ఒకప్పుడు బ్రాండ్ల కోసం ఆడే ఆటగాడి స్థాయి నుంచి, బ్రాండ్లను నిర్మించే స్థాయికి కోహ్లీ ఎదిగారు.
డబ్బు కంటే దేశీయ వృద్ధి, దీర్ఘకాలిక విజయం ముఖ్యమని కోహ్లీ మరోసారి నిరూపించారు. రూ. 300 కోట్ల డీల్‌ను వదులుకుని భారతీయ కంపెనీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆయన తన అభిమానులకు, యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..