Cheteshwar Pujara: కెప్టెన్‌గా ఛెతేశ్వర్ పుజారా.. టీమిండియా నయావాల్ సరికొత్త చరిత్ర..

|

Jul 19, 2022 | 5:07 PM

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు.

Cheteshwar Pujara: కెప్టెన్‌గా ఛెతేశ్వర్ పుజారా.. టీమిండియా నయావాల్ సరికొత్త చరిత్ర..
Sussex Cheteshwar Pujara
Follow us on

ససెక్స్ తాత్కాలిక కెప్టెన్‌గా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా(cheteshwar pujara) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గాయపడడంతో పుజారాకు ఈ బాధ్యతలు అప్పగించారు. మిడిల్‌సెక్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో పుజారా ససెక్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి, లీసెస్టర్‌షైర్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టామ్ హైన్స్ చేతికి గాయమైంది. ఆ తర్వాత అతనికి 5 నుంచి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. హెయిన్స్ లేకపోవడంతో జట్టును హ్యాండిల్ చేసే బాధ్యత పుజారా భుజస్కంధాలపై పడింది.

పుజారా కెప్టెన్‌గా మారడంపై జట్టు ప్రధాన కోచ్ ఇయాన్ సాలిస్‌బరీ మాట్లాడుతూ, పుజారా ఈ బాధ్యతను చేపట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. పుజారా జట్టుతో అనుబంధం ఉన్నందున, అతను జట్టుకు సహజ నాయకుడని చెప్పాడు. అతను చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అద్భుతంగా ఆడతాడు. చెతేశ్వర్ పుజారా పేలవ ఫామ్ కారణంగా ఈ ఏడాది భారత జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీలో కూడా అతని బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు. మూడేళ్ల పాటు సెంచరీ చేయలేకపోయాడు. పుజారా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను ఆశ్రయించాడు. ప్రస్తుతం అతను తన బ్యాట్‌తో నిరంతరం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

బ్యాట్‌తో కౌంటీలో రెచ్చిపోయిన పుజారా..

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సెకండ్ డివిజన్‌లో ఆడుతున్నప్పుడు అతను వీరంగం సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు, అతను మిడిల్‌సెక్స్‌పై 170 నాటౌట్, డర్హామ్‌పై 203, వోర్సెస్టర్‌షైర్‌పై 109, కౌంటీలో డెర్బీషైర్‌పై 201 నాటౌట్‌గా నిలిచాడు. కౌంటీ పటిష్ట ప్రదర్శనను ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రూపంలో పుజారాకు బహుమతిగా అందించారు. ఈ నెల ప్రారంభంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అతను 13, 66 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అతను ఇప్పటివరకు ఈ కౌంటీ సీజన్‌లో ససెక్స్ తరపున ఆడిన పుజారా 750కి పైగా పరుగులు చేయడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..