
Sarfaraz Khan Weight Loss Secret: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తన కొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలతో తరచుగా ట్రోలింగ్‌కు గురైన సర్ఫరాజ్, ఇప్పుడు గణనీయంగా బరువు తగ్గి, స్లిమ్‌గా కనిపించడం విశేషం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 17 కిలోల బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యం, అతను పాటించిన కఠినమైన డైట్ ప్లాన్, వ్యాయామ నియమాలే అని అతని తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ వెల్లడించారు.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సర్ఫరాజ్‌కు టీమిండియాలో స్థానం దక్కడం ఆలస్యమైంది. గత కొంతకాలంగా జట్టులోకి వస్తూ పోతూ ఉన్న సర్ఫరాజ్, టెస్ట్ ఫార్మాట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడం కూడా అతనిలో ఈ బరువు తగ్గించుకోవాలనే సంకల్పాన్ని మరింత పెంచిందని తెలుస్తోంది. టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ మార్పుతో సెలెక్టర్లకు సంకేతం పంపాడు.
సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గడంలో అతని డైట్ ప్లాన్ కీలక పాత్ర పోషించింది. అతని తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం, వారు తమ కుటుంబం మొత్తంతో కలిసి బరువు తగ్గడంపై దృష్టి పెట్టారు.
బియ్యం, గోధుమలకు దూరం: రోటీ, బియ్యంతో చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. గత రెండు నెలలుగా వారి ఇంట్లో రోటీలు, అన్నంతో వంటకాలు చేసుకోవడం లేదని తెలిపారు.
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం: బ్రకోలీ, క్యారెట్, దోసకాయ, ఆకుపచ్చని కూరగాయలతో చేసిన సలాడ్లు ఎక్కువగా తీసుకున్నారు. గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ చికెన్, ఉడకబెట్టిన చికెన్, బాయిల్డ్ ఎగ్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకున్నారు.
చక్కెర, శుద్ధి చేసిన పిండికి గుడ్ బై: చక్కెర, మైదాతో చేసిన పదార్థాలు, బేకరీ వస్తువులు, స్వీట్లు వంటివి పూర్తిగా మానేశారు.
గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ: రోజూ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగుతున్నారు.
ఆలివ్ ఆయిల్: తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించారు.
బిర్యానీ త్యాగం: సర్ఫరాజ్‌కు ఎంతో ఇష్టమైన చికెన్, మటన్ బిర్యానీని ఈ రెండు నెలల కాలంలో పూర్తిగా వదులుకున్నాడు. బిర్యానీ బదులుగా అవకాడో తింటున్నాడట.
మొలకెత్తిన విత్తనాలు: రోజుకు ఒకసారి మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటున్నాడు.
ఆహార నియమాలతో పాటు, సర్ఫరాజ్ ఖాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ జిమ్‌లో క్రమం తప్పకుండా వ్యాయామం చేశాడు. రోజుకు ఒక గంట పాటు వారానికి ఆరు రోజులు జిమ్ చేసి, ఆ తర్వాత రన్నింగ్, స్విమ్మింగ్ కూడా చేసేవాడని అతని తండ్రి తెలిపారు.
ఈ కఠినమైన డైట్, వ్యాయామ ప్రణాళికతో సర్ఫరాజ్ కేవలం రెండు నెలల్లోనే తన శరీరంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చాడు. ఈ మార్పు అతని ఫిట్‌నెస్‌ను గణనీయంగా మెరుగుపరిచి, భవిష్యత్తులో టీమిండియాలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి సహాయపడుతుంది అనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..