Jasprit Bumrah: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక అవార్డుల్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారీ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రాను ఐసీసీ ఎంచుకుంది. 2024 సంవత్సరంలో తన చిరస్మరణీయ ప్రదర్శనకు జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రాకు గత టెస్టు సిరీస్ ఎంతో బాగుంది. భారత్‌తో పాటు విదేశీ పరిస్థితుల్లోనూ ఆకట్టుకున్నాడు. బుమ్రా 2023 సంవత్సరం చివరిలో వెన్నునొప్పి నుంచి కోలుకున్న తర్వాత టెస్ట్‌కి తిరిగి వచ్చాడు. 2024 సంవత్సరంలో అతను టీమిండియా అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు. గత ఏడాది ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లపై స్వదేశంలో జరిగిన టెస్టుల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు, అతను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా సక్సెస్ అయ్యాడు.
జస్ప్రీత్ బుమ్రా 2024లో మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 14.92 సగటుతో 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. అతను తప్ప మరే ఇతర బౌలర్ కూడా 60 వికెట్ల సంఖ్యను తాకలేకపోయాడు. టెస్టు చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 70+ వికెట్లు తీసిన 17 మంది బౌలర్లలో బుమ్రా అంత తక్కువ సగటును ఏ బౌలర్ చేరుకోలేకపోయాడు. అదే సమయంలో, ఒక క్యాలెండర్ ఇయర్‌లో 70+ టెస్టు వికెట్లు తీసిన నాల్గవ భారత బౌలర్ బుమ్రా నిలిచాడు.
‘Game Changer’ Jasprit Bumrah is awarded the ICC Men’s Test Cricketer of the Year 2024 🥁🥁
Bumrah took 71 wickets at a stunning average of 14.92, finishing as the highest wicket taker in Test cricket in 2024.#TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/WHUciUK2Qb
— BCCI (@BCCI) January 27, 2025
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆరో భారతీయుడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అతని కంటే ముందు రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే, వీరెవరూ ఫాస్ట్ బౌలర్లు కాదు. అంటే, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన భారత్ నుంచి తొలి ఫాస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన తర్వాత జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ, ‘ఈ ఫార్మాట్ నా హృదయానికి చాలా దగ్గరైంది. నాకెప్పుడూ టెస్టు క్రికెట్ ఆడాలని కోరిక. గతేడాది నాకు చాలా ప్రత్యేకమైనది. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మ్యాచ్‌లు కూడా గెలిచాను. వైజాగ్‌లో ఓలీ పోప్ వికెట్ నాకు అత్యంత ప్రత్యేకమైనది. ఆ వికెట్ కారణంగా మ్యాచ్ రూపు రేఖలు మారిపోయాయి. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ” చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..