Team India : ఇంగ్లాండ్ సిరీస్‌కు ఐపీఎల్ జట్ల వారీగా ఎంపిక.. ఏ జట్టు నుంచి ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే ?

Team India : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి అత్యధికంగా నలుగురు ఎంపిక కాగా, కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ జట్ల వారీగా ఎవరి నుంచి ఎంత మంది సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.

Team India : ఇంగ్లాండ్ సిరీస్‌కు ఐపీఎల్ జట్ల వారీగా ఎంపిక.. ఏ జట్టు నుంచి ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే ?
Team India

Updated on: Jun 22, 2026 | 9:20 AM

Team India : బీసీసీఐ జూలై 14 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్, అదే జోరును ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌కు యువ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

కోహ్లీ, బుమ్రా రీ-ఎంట్రీ హంగామా

ఈ జట్టు ప్రకటనలో అత్యంత పెద్ద హైలైట్ ఏంటంటే.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, యార్కర్ కింగ్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నప్పటికీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడటం అనేది బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి పేస్ విభాగాన్ని నడిపించడానికి సిద్ధమయ్యాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా ఆడబోయే మొదటి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.

ఐపీఎల్ జట్ల వారీగా ఆటగాళ్ల ఎంపిక వివరాలు

గుజరాత్ టైటాన్స్ (నలుగురు):

భారత వన్డే జట్టులో ఈసారి గుజరాత్ టైటాన్స్ హవా నడిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు ఈ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ 2026లో గిల్ 732 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గుజరాత్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించిన వాషింగ్టన్ సుందర్, ఐపీఎల్‌లో 16 వికెట్లు తీసిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌పై వన్డే అరంగేట్రం చేసి 7 వికెట్లతో మెరిసిన పొడుగు కాళ్ల ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఈ లిస్ట్‌లో ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ముగ్గురు):

ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఎంపికయ్యారు. ఐపీఎల్‌లో 174 స్ట్రైక్ రేట్‌తో 593 రన్స్ చేసి అదరగొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ భారతాన్ని మోయనున్నాడు. అతనితో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌లు ఈ 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ (ఇద్దరు):

తెలుగు క్రికెట్ అభిమానులకు సంతోషాన్నిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి ఇద్దరు పవర్‌ఫుల్ ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. ఐపీఎల్‌లో 602 రన్స్ చేసి, ఆఫ్ఘనిస్తాన్‌పై 125 రన్స్‌తో సెంచరీ బాదిన ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒకరైతే, తన అద్భుతమైన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో 171 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టిన యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి మరొకరు.

పంజాబ్ కింగ్స్ (ఇద్దరు):

పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఐపీఎల్‌లో అతను 498 రన్స్ చేశాడు. అతనితో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై అర్ష్‌దీప్ 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ (ఇద్దరు):

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డే జట్టులో తన అనుభవాన్ని జోడించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో 143 రన్స్ చేసిన రోహిత్, ఇంగ్లాండ్ కండిషన్స్‌లో టీమిండియాకు చాలా కీలకం కానున్నాడు. అతనితో పాటు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఒక్కరు):

కేకేఆర్ జట్టు నుంచి మోకాలి గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన యంగ్ పేసర్ హర్షిత్ రాణా పూర్తిగా కోలుకుని వన్డే జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆర్సీబీ (RCB) నుంచి కేవలం కింగ్ విరాట్ కోహ్లీ ఒక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా ఈ సిరీస్‌కు సెలెక్ట్ కాకపోవడం గమనార్హం.

ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత వన్డే జట్టు :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us