
India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది.
అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ పెరుగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే బాదుడే లక్ష్యంగా మైదానంలోకి దిగుతున్న భారత బ్యాటర్లు పదే పదే 200 ప్లస్ స్కోర్లు నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్రికెట్ జట్టుకూ సాధ్యం కాని రీతిలో టి20ల్లో ఏకంగా 52 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్‌గా భారత్ గుర్తింపు పొందింది.
ఈ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 46 సార్లు 200 ప్లస్ పరుగులు చేసి రెండో స్థానంలో నిలవగా, కౌంటీ క్రికెట్ జట్టు సమర్‌సెట్ 44 సార్లు ఈ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఓ అంతర్జాతీయ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీల కంటే, విదేశీ కౌంటీ క్లబ్‌ల కంటే ఎక్కువసార్లు భారీ స్కోర్లు నమోదు చేయడం భారత బ్యాటింగ్ శైలిలోని దూకుడుకు అద్దం పడుతోంది.
2026 క్యాలెండర్ ఇయర్‌లో భారత జట్టు మరో చారిత్రాత్మక రికార్డును సాధించింది. ఒకే ఏడాది వ్యవధిలో ఏకంగా 9 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 2024లో సాధించిన 9 సార్లు 200 ప్లస్ స్కోర్ల రికార్డును టీమిండియా ఈ ఏడాది మళ్లీ పునరావృతం చేసి సమం చేయడం విశేషం.
ఇంతకుముందు 2023లో భారత్ 7 సార్లు ఈ మైలురాయిని అందుకోగా, 2024లో జపాన్ 7 సార్లు, 2025లో ఆస్ట్రియా 7 సార్లు ఈ ఘనత సాధించాయి. 2022లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, 2024లో వెస్టిండీస్ జట్లు తలో 6 సార్లు మాత్రమే 200 దాటించగలిగాయి. అయితే వీరందరినీ దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడమే కాక, తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ ముందుకు సాగుతోంది.
పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు వ్యూహం పూర్తిగా మారిపోయింది. పవర్ ప్లే ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం, చివరి ఓవర్ వరకు అదే వేగాన్ని కొనసాగించడం టీమిండియా నయా సూత్రంగా మారింది. యంగ్ ఓపెనర్లు, మిడిలార్డర్ పవర్‌హెట్టర్లు భయం లేకుండా వికెట్ నష్టపోయినా లెక్కచేయకుండా బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తుండటంతో ప్రతీ మ్యాచ్‌లోనూ కొండంత స్కోర్లు సాధించడం సాధ్యమవుతోంది.
ముఖ్యంగా వికెట్లు పడినా రన్ రేట్ తగ్గకుండా చూడటంతో ప్రత్యర్థి జట్లు ఒత్తిడిలో పడిపోతున్నాయి. రాబోయే సిరీస్‌లలోనూ భారత్ ఇదే ఆక్రమణ శైలిని కొనసాగిస్తే, ఒకే ఏడాదిలో 10 సార్లు 200 ప్లస్ సాధించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..