India Cricket Team: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) కోచ్‌గా ఉన్న ద్రావిడ్.. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో అందరి దృష్టి ద్రావిడ్ పైనే పడింది. అలాగే. ద్రవిడ్ నుంచి ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పోటీ పడుతున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘ద్రావిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్‌సీఏ హెడ్ రేస్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత కొంతకాలంగా రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్లు విపరీతంగా వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సీజన్ ఫైనల్ సమయంలో రాహుల్ ద్రావిడ్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
‘‘జాతీయ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ అంగీకరించారు. యువ క్రికెటర్లతో జట్టు బలంగా ఉంది. వారందరూ ద్రవిడ్‌తో కలిసి పని చేశారు కూడా. విదేశాల్లోని పిచ్‌లపై అవగాహన తెచ్చుకోవడానికి ద్రావిడ్ కోచింగ్ ఉపకరిస్తుంది. బీసీసీఐ ప్రాధాన్యతా వ్యక్తుల్లో ద్రావిడ్‌కు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.’’ అని బీసీసీఐ ప్రతినిథి ఒకరు చెప్పుకొచ్చారు. అయితే, ద్రావిడ్ ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి, కార్యదర్శి జే షా మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. వారి ఒత్తిడి మేరకే ద్రావిడ్.. టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. పదవీ కాలం ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లీగ్‌తో ముగియనుంది. టీ20 ప్రపంచప్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు.
Also read:
Rare Case: వృద్ధురాలిని పొడిచిన ఆవు.. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు