ఒకటి కాదు, రెండు కాదు భయ్యో.. ఏకంగా 20 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్.. సీన్ కట్‌చేస్తే.. టీ20 ప్రపంచ కప్ నుంచి ఔట్?

India vs South Africa: సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి పేలవమైన ప్రదర్శన భారత క్రికెట్ సమాజంలో ఆందోళనలను రేకెత్తించింది. ఒకప్పుడు భారతదేశపు అత్యంత విశ్వసనీయ టీ20 బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన కెప్టెన్, కీలకమైన మ్యాచ్‌లలో నిలకడగా ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న కొద్దీ కెప్టెన్ పై నమ్మకం సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకటి కాదు, రెండు కాదు భయ్యో.. ఏకంగా 20 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్.. సీన్ కట్‌చేస్తే.. టీ20 ప్రపంచ కప్ నుంచి ఔట్?
Suryakumar Yadav

Updated on: Dec 18, 2025 | 8:49 AM

Suryakumar Yadav: ప్రస్తుతం భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ చుట్టూ పెను వివాదం నడుస్తోంది. అద్భుతమైన షాట్లతో ‘మిస్టర్ 360’గా పేరుగాంచిన సూర్య, గత కొన్ని మ్యాచ్‌లుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వరుస వైఫల్యాలు – ఆందోళనలో అభిమానులు..

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గత 20కిపైగా ఇన్నింగ్స్‌ల్లో ఆయన ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించకపోవడం గమనార్హం. 2025లో ఆయన సగటు కేవలం 14.20గా ఉంది.

ధర్మశాల టీ20: 11 బంతుల్లో 12 పరుగులు.

ముల్లాన్‌పూర్ టీ20: కేవలం 5 పరుగులు.

కటక్ టీ20: 12 పరుగులు.

సూర్య ఏమంటున్నారు?..

తన ఫామ్‌పై వస్తున్న విమర్శలను సూర్యకుమార్ కొట్టిపారేశారు. “నేను ఫామ్ కోల్పోలేదు, కేవలం పరుగులు మాత్రమే రావట్లేదు. నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు రావాల్సిన సమయంలో కచ్చితంగా వస్తాయి” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జట్టు సభ్యుడు శివమ్ దూబే కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తూ, ఆయన ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల ఆటగాడని పేర్కొన్నారు.

2026 ప్రపంచకప్ నుంచి తొలగింపు? – అసలు నిజం..

కొన్ని నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు “సూర్యకుమార్‌ను 2026 టీ20 ప్రపంచకప్ నుంచి బోర్డు తప్పించబోతోంది” అని ప్రచారం చేస్తున్నాయి. అయితే, బీసీసీఐ (BCCI) నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సూర్యకుమార్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు (భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది).

అయితే, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వంటి విశ్లేషకులు ఒక హెచ్చరిక జారీ చేశారు. “కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం కాదు, టాప్ ఆర్డర్‌లో ఉండి పరుగులు చేయడం కూడా ముఖ్యం. వరల్డ్ కప్ సమయానికి ఫామ్ అందుకోకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆయన ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 2026 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉండటంతో, రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లోనైనా ఆయన తిరిగి లయ అందుకుంటారని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఒకవేళ ఇదే వైఫల్యం కొనసాగితే, సెలెక్టర్లు హార్దిక్ పాండ్యా లేదా శుభ్‌మన్ గిల్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో సూర్య భారీ స్కోరు సాధిస్తే తప్ప ఈ విమర్శలకి తెరపడదు.