
Shubman Gill Fight Umpire: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌లో బంతి మార్పు విషయంలో శుభమాన్ గిల్, మహ్మద్ సిరాజ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెండో రోజు ఆటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 91వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. అంతకుముందు, 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకున్నారు. అయితే, కేవలం 10 ఓవర్ల తర్వాతే బంతి ఆకారం మారిపోయిందని భావించిన భారత జట్టు, బంతిని మార్చాలని అంపైర్‌ను కోరింది. అంపైర్ పరీక్షించిన తర్వాత బంతిని మార్చడానికి అంగీకరించారు.
అయితే, కొత్తగా ఇచ్చిన బంతిని చూసిన భారత కెప్టెన్ శుభమాన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది 10 ఓవర్ల బంతిలా లేదని, ఇంకా పాతదిగా ఉందని వాదించాడు. గిల్‌తో పాటు మహ్మద్ సిరాజ్ కూడా అంపైర్‌తో “ఇది కొత్త బంతా? సీరియస్‌గా?” అని స్టంప్ మైక్‌లో వినిపించే విధంగా ప్రశ్నించాడు. ఈ బంతి తమకు కావలసిన విధంగా స్వింగ్ అవ్వడం లేదని, సీమ్ మూవ్‌మెంట్ కూడా పెద్దగా లేదని భారత ఆటగాళ్లు ఆరోపించారు.
అయితే, అంపైర్ మాత్రం గిల్ వాదనను తోసిపుచ్చి, ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. దీంతో గిల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంటరీలో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా గిల్‌కు మద్దతుగా నిలిచారు. ఆ బంతి 10 ఓవర్ల బంతిలా కాకుండా 20 ఓవర్ల పాత బంతిలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ బంతి మార్పు వివాదం వల్ల భారత బౌలర్లు తమ లయను కోల్పోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరంభంలో బుమ్రా మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీసినప్పటికీ, బంతి మారిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును పెంచగలిగారు. చివరికి, మార్చిన బంతి కూడా కేవలం 48 బంతుల తర్వాత మళ్లీ మార్చాలని వచ్చింది.
డ్యూక్స్ బంతుల నాణ్యత, అవి ఆకారాన్ని త్వరగా కోల్పోవడం ఈ సిరీస్‌లో ఒక పెద్ద సమస్యగా మారింది. బౌలర్లు బంతి త్వరగా పాతబడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మ్యాచ్‌కు మరింత ఉత్కంఠను జోడించింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..