Most Runs in T20Is: బాధేస్తుంది మామ.. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-7 బ్యాట్స్‌మెన్లో మనోళ్లు ఒక్కరు లేరట
2025లో ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆశ్చర్యకర ఫలితాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆస్ట్రియా ఆటగాడు కరణ్‌బీర్ సింగ్ అగ్రస్థానంలో ఉండగా, టాప్-7 లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా లేకపోవడం గమనార్హం. భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Most Runs in T20Is: 2025 సంవత్సరం టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు చాలా ఉత్సాహంగా సాగింది. అయితే, ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా చూస్తే భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, టాప్-7లో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు. ఆస్ట్రియాకు చెందిన కరణ్‌బీర్ సింగ్ ఏకంగా 1240 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఈ ఏడాది పరుగుల సునామీ సృష్టించిన టాప్-7 బ్యాటర్లు ఎవరు? భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం.
పరుగుల రారాజు కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా)
2025లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రియాకు చెందిన కరణ్‌బీర్ సింగ్ నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 28 మ్యాచ్‌లలో 49.60 సగటుతో ఏకంగా 1240 పరుగులు సాధించాడు. ఈ ఏడాది 1000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడు కూడా ఇతనే.
టాప్-7లో చిన్న దేశాల ఆధిపత్యం
ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో చిన్న దేశాల ఆటగాళ్లు పెద్దగా రాణించారు. టాప్-7లో బహ్రెయిన్, ఆస్ట్రియా, హాంకాంగ్, జింబాబ్వే, మలేషియా వంటి దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. రెండో స్థానంలో బహ్రెయిన్‌కు చెందిన ఫైజ్ అహ్మద్ ఉన్నాడు. ఇతను 29 మ్యాచ్‌లలో 58.93 సగటుతో 943 పరుగులు చేశాడు. ఆస్ట్రియాకే చెందిన మరో ఆటగాడు బిలాల్ జల్మై (32 మ్యాచ్‌లలో 851 పరుగులు) మూడో స్థానంలో నిలిచాడు.
మిగిలిన టాప్ స్కోరర్లు వీరే
నాల్గవ స్థానంలో హాంకాంగ్‌కు చెందిన వికెట్ కీపర్ అంశుమాన్ రథ్ (19 మ్యాచ్‌లలో 778 పరుగులు) ఉన్నాడు. ఇక, బహ్రెయిన్‌కు చెందిన మరో వికెట్ కీపర్ ప్రశాంత్ కూరూప్ 29 మ్యాచ్‌లలో 744 పరుగులు చేసి ఐదవ స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రియాన్ బెన్నెట్ (18 మ్యాచ్‌లలో 708 పరుగులు) ఆరవ స్థానంలో, మలేషియా ఆల్‌రౌండర్ వీరన్‌దీప్ సింగ్ (20 మ్యాచ్‌లలో 642 పరుగులు) ఏడవ స్థానంలో ఉన్నారు.
భారత బ్యాటర్ల పరిస్థితి ఏంటి?
టాప్-7 అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అభిషేక్ శర్మ. యువ ఓపెనర్ అయిన అభిషేక్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 49.41 మంచి సగటుతో 593 పరుగులు సాధించాడు. అయితే, ప్రపంచ జాబితాలో చూస్తే అభిషేక్ శర్మకు 13వ స్థానం దక్కింది. అంటే, భారత్‌లో నంబర్ 1గా ఉన్నా, ప్రపంచంలో మాత్రం అతను టాప్-10లో కూడా లేడు. ఈ గణాంకాలు చిన్న దేశాల ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌లో ఎంత దూకుడుగా ఆడుతున్నారో స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




