SL vs ZIM: మొన్న ఆస్ట్రేలియాకు.. నేడే శ్రీలంకకు.. దిమ్మతిరిగే షాకిచ్చిన జింబాబ్వే

Sikandar Raza-Brian Bennett: కొలంబోలో జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే తమ చివరి గ్రూప్ బీ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి, గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సూపర్ 8లో ఇంకెన్ని షాక్‌లు ఇవ్వనుందోనని అన్ని జట్లు భయపడేలా చేసింది జింబాబ్వే టీం.

SL vs ZIM: మొన్న ఆస్ట్రేలియాకు.. నేడే శ్రీలంకకు.. దిమ్మతిరిగే షాకిచ్చిన జింబాబ్వే
Sl Vs Zim

Updated on: Feb 19, 2026 | 7:15 PM

టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్బీ  చివరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను కొలంబోలోనే ఓడించింది. ఈ విజయంతో సూపర్-8కు ముందే గ్రూప్–బీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి సూపర్-8లోకి అర్హత సాధించిన జింబాబ్వే, ఇప్పుడు శ్రీలంకపై గెలిచి ‘గ్రూప్ టాపర్’గా నిలవడం విశేషం.

శ్రీలంకపై గెలిచి గ్రూప్–బీలో టాప్‌కు చేరిన జింబాబ్వే..

ఈ మ్యాచ్‌కు ముందు గ్రూప్–బీలో జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఫిబ్రవరి 19న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను ఓడించడంతో పాయింట్ల పట్టిక పూర్తిగా తలకిందులైంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత జింబాబ్వే 7 పాయింట్లతో నంబర్–1గా నిలిచింది. శ్రీలంక 6 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.

శ్రీలంకపై చరిత్ర సృష్టించిన జింబాబ్వే..

శ్రీలంక నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి చేధించింది. ఇది ఐసీసీ టోర్నమెంట్‌లలో శ్రీలంకపై జింబాబ్వే సాధించిన తొలి విజయం. అలాగే టీ20 అంతర్జాతీయాల్లో జింబాబ్వేకు ఇది రెండో అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్‌గా నిలిచింది.

కెప్టెన్ సికందర్ రజా ‘మ్యాచ్ విన్నింగ్’ ఇన్నింగ్స్..

ఈ విజయానికి కెప్టెన్ సికందర్ రజా ప్రధాన కారణం. అతనితో పాటు ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ కూడా అద్భుత అర్ధశతకంతో రాణించాడు. బ్రియన్ బెన్నెట్ 48 బంతుల్లో 63 పరుగులు చేయగా, సికందర్ రజా కేవలం 26 బంతుల్లోనే 45 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి 173కి పైగా స్ట్రైక్‌రేట్‌తో జట్టును గెలిపించాడు.

శ్రీలంక బ్యాటింగ్..

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. పథుమ్ నిస్సాంక 41 బంతుల్లో 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పవన్ రత్నాయకె 44 పరుగులతో మంచి సహకారం అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us