
T20 World Cup 2026 : 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వేదికల వివరాలు బయటకు వచ్చాయి. ఈ మెగా ఈవెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఐసీసీ త్వరలో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనున్నప్పటికీ, అంతకుముందే బీసీసీఐ అధికారుల సమావేశంలో భారత్‌లో మ్యాచ్‌లు నిర్వహించే నగరాలను ఖరారు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడించింది. మొత్తం ఐదు భారతీయ నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ ఫైనల్ ఎక్కడ జరగవచ్చు, ఏయే నగరాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి అనే వివరాలు తెలుసుకుందాం.
2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం బీసీసీఐ ఐదు భారతీయ నగరాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. 2023 వన్డే ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి తక్కువ నగరాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలు టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఖరారయ్యాయి. షార్ట్‌లిస్ట్ చేసిన ప్రతి వేదికలో ఆరు చొప్పున మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ అధికారుల సమావేశంలో ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, కొన్ని కీలక నిబంధనలను ఐసీసీ బీసీసీఐకి స్పష్టం చేసింది. ఒకవేళ శ్రీలంక జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌ను తప్పనిసరిగా కొలంబోలో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే, భద్రతా కారణాల దృష్ట్యా ఆ టైటిల్ పోరును న్యూట్రల్ వేదికపై నిర్వహిస్తారు. అంటే ఆ సందర్భంలో ఫైనల్ భారత్‌లో జరగకపోవచ్చు. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకోకపోతే, ఫైనల్ మ్యాచ్‌ను షార్ట్‌లిస్ట్ చేసిన ఐదు నగరాల్లో ఏదో ఒక నగరంలో ముఖ్యంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, శ్రీలంకలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంకలో మూడు స్టేడియంలలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు, అయితే ఆ మూడు వేదికలు ఏవనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన గువాహటి, విశాఖపట్నం, ఇండోర్, నవీ ముంబై వంటి స్టేడియాలకు టీ20 ప్రపంచకప్ 2026 నిర్వహణ అవకాశం ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..