
T20 World Cup 2026 : వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియాను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నారు. అయితే ఈ జట్టులో ఎంపికైన ఐదుగురు ఆటగాళ్లు 2021 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడారు. ఆనాడు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఆ టోర్నీ నుంచి ఈ ఐదుగురు ఇప్పుడు సీనియర్లుగా ఎలా ఎదిగారో ఈ వార్తలో చూద్దాం.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) : 2021 వరల్డ్ కప్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఒక వర్ధమాన ఆటగాడు. ఆ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగారు. కానీ, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సూర్య ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ మాత్రమే కాదు, భారత జట్టుకు కెప్టెన్ కూడా. 2026లో సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో జట్టును విజేతగా నిలపాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉంది.
హార్దిక్ పాండ్యా : 2021 వరల్డ్ కప్ హార్దిక్ పాండ్యాకు ఒక పీడకల లాంటిది. అప్పట్లో గాయాలతో సతమతమవుతున్న ఆయన బౌలింగ్ చేయలేకపోయారు. బ్యాటింగ్‌లోనూ 5 మ్యాచ్‌లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేశారు. అయితే, ఆ తర్వాత తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని టీమిండియాకు అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగారు. ప్రస్తుతం జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న పాండ్యా, తన పవర్ హిట్టింగ్, బౌలింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడు.
జస్ప్రీత్ బుమ్రా : 2021 టోర్నీలో భారత్ త్వరగానే నిష్క్రమించినప్పటికీ, బుమ్రా మాత్రం తన ప్రతాపం చూపారు. 5 మ్యాచ్‌లలో 7 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు. 2026లో కూడా భారత బౌలింగ్ విభాగానికి బుమ్రానే వెన్నెముక. యార్కర్ల కింగ్‌గా పేరొందిన ఆయన, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
వరుణ్ చక్రవర్తి : 2021 వరల్డ్ కప్ తర్వాత వరుణ్ చక్రవర్తి దాదాపు టీమ్ నుంచి కనుమరుగైపోయారు. ఆ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కానీ, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో మళ్ళీ తన మిస్టరీ బౌలింగ్‌కు పదును పెట్టి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా ఉన్న వరుణ్, ఈసారి భారత్‌కు ట్రంప్ కార్డ్ కాబోతున్నారు.
ఇషాన్ కిషన్ : 2021లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి 4 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయారు. కానీ, దేశవాళీ క్రికెట్‌లో (ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో) పరుగుల సునామీ సృష్టించి మళ్ళీ సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. రిషబ్ పంత్ లేని లోటును భర్తీ చేస్తూ, వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ ఈసారి ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..