
SL vs ENG T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలుసిసలు మజా ఇచ్చే సూపర్ 8 రౌండ్ మొదలైందో లేదో.. అప్పుడే వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో వర్షం కారణంగా ఇప్పటికే కీలక మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. శనివారం కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే క్యాన్సిల్ అయిపోగా, నేడు కాండీ వేదికగా జరగనున్న శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
పల్లెకెలెలో వాతావరణం ఎలా ఉంది?
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడ వర్షం కురిసే అవకాశం 87 శాతం మేరకు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. టాస్ పడే సమయానికి (మధ్యాహ్నం 2:30) కూడా ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. సాయంత్రం వేళల్లో కూడా వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంటే, ఈ రోజు కూడా మ్యాచ్ జరగడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి కూడా వరుణుడు కనికరించేలా కనిపించడం లేదు.
గ్రూప్ 2 ఈక్వేషన్లు ఏంటి?
ఈ సూపర్ 8 రౌండ్‌లో గ్రూప్ 2లో పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. నిన్న పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆ రెండు జట్లకు చెరో 1 పాయింట్ లభించింది. ఒకవేళ ఈరోజు శ్రీలంక-ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా రద్దైతే, ఈ రెండు జట్లకు కూడా తలో 1 పాయింట్ వస్తుంది. దీనివల్ల గ్రూప్ 2లోని నాలుగు జట్లూ సమానంగా 1 పాయింట్ వద్ద నిలుస్తాయి. రన్ రేట్ కూడా 0.000 వద్దే ఉంటుంది.
సెమీఫైనల్ రేసులో నిలవాలంటే..
సూపర్-8లో ప్రతి జట్టు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లే సెమీఫైనల్‌కు వెళ్తాయి. వరుసగా మ్యాచ్‌లు రద్దవుతుండటంతో జట్ల భవితవ్యం ఇప్పుడు వరుణుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది కాబట్టి, వర్షం తగ్గాలని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సూపర్ 8 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం జట్లకు పెద్ద మైనస్ పాయింట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..