
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచి దేశమంతటా పండగ వాతావరణాన్ని నింపింది. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడి టీమిండియా చరిత్ర సృష్టించింది. అయితే ఈ గెలుపు కేవలం ఆటగాళ్లకు, అభిమానులకే కాదు.. ఐసీసీ (ICC)తో పాటు ప్రకటనకర్తలకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తాజా నివేదికల ప్రకారం..ఈ మెగా టోర్నీ ద్వారా కేవలం అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్, ఫైనల్ పోరు ఈ కనకవర్షానికి ప్రధాన కారణమయ్యాయి.
ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా నివేదిక ప్రకారం.. ఈ వరల్డ్ కప్‌లో కేవలం ప్రకటనల ద్వారానే సుమారు రూ.1500 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. టోర్నీ ప్రారంభంలో అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ, భారత్ వరుస విజయాలతో దూసుకుపోవడంతో బ్రాండ్లన్నీ క్యూ కట్టాయి. సాధారణంగా జరిగే చిన్న మ్యాచ్‌లకు 10 సెకన్ల యాడ్ స్లాట్ ధర రూ. 7.5 లక్షలు ఉండగా, టోర్నీ రసవత్తరంగా మారుతున్న కొద్దీ ఆ ధర రూ.16 లక్షల వరకు పెరిగింది. ఇక దాయాదుల పోరు భారత్-పాక్ మ్యాచ్ విషయానికి వస్తే, ఆ క్రేజ్ మామూలుగా లేదు. కేవలం 10 సెకన్ల యాడ్ కోసం కంపెనీలు రూ.20 నుంచి 25 లక్షల వరకు వెచ్చించాయి.
సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కూడా యాడ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ మ్యాచ్‌ల కోసం 10 సెకన్ల స్లాట్ ధర రూ.15 నుంచి 20 లక్షల మధ్య పలికింది. అరామ్కో, డిపి వరల్డ్, ఎమిరేట్స్ వంటి ఐసీసీ ప్రధాన స్పాన్సర్లు ఒక్కో కంపెనీ ప్రకటనల కోసం సుమారు రూ.75 కోట్లు ఖర్చు చేశాయి. ఇతర కంపెనీలు కూడా తమ బ్రాండ్ ఇమేజ్ కోసం రూ.15 నుంచి 20 కోట్ల వరకు కుమ్మరించాయి. టీమిండియా టైటిల్ రేసులో ఉండటమే ఈ స్థాయిలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, మార్చి 8న జరిగిన ఫైనల్‌లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. సంజూ శాంసన్ 89 పరుగులతో వీరవిహారం చేయడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తమ పదునైన బౌలింగ్‌తో కివీస్‌ను 159 పరుగులకే కట్టడి చేశారు. ఈ అద్భుత విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోవడమే కాకుండా, కమర్షియల్ గా కూడా వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టోర్నీలలో ఒకటిగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..