AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ ఆడలేదని కోమాలోకి ప్లేయర్లు.. బంగ్లా కోచ్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే టీ20 వరల్డ్ కప్ 2026. భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగ్లాదేశ్ తమ జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ ఆడలేదని కోమాలోకి ప్లేయర్లు.. బంగ్లా కోచ్ సంచలన వ్యాఖ్యలు
Bangladesh Cricket Controversy
Rakesh
|

Updated on: Feb 21, 2026 | 2:36 PM

Share

T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే టీ20 వరల్డ్ కప్ 2026. భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగ్లాదేశ్ తమ జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది. వారి స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో చిచ్చు రేపుతున్నాయి. జట్టు అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ సలావుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

బంగ్లాదేశ్ మాజీ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ పై కోచ్ సలావుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట భద్రతా కారణాల వల్ల జట్టును భారత్‌కు పంపలేదని చెప్పిన నజ్రుల్, పదవి నుంచి తప్పుకునే ముందు మాట మార్చారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్, ఆటగాళ్లదేనని బాంబు పేల్చారు. దీనిపై కోచ్ స్పందిస్తూ.. అసిఫ్ నజ్రుల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నేను కూడా ఒక టీచర్‌నే, సాధారణంగా టీచర్లు అబద్ధాలు చెప్పరు. కానీ ఆయన ఇంత బహిరంగంగా అబద్ధం చెబుతారని నేను ఊహించలేదు. అసలు ఆటగాళ్లకు నేను ఏ ముఖం చూపించాలి? ఆయన తీసుకున్న యూ-టర్న్ అస్సలు ఆమోదయోగ్యం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరల్డ్ కప్ ఆడాలనేది ఏ క్రికెటర్ కైనా ఒక జీవితకాల కల. బంగ్లాదేశ్ జట్టు మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆటగాళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఒక కుర్రాడు వరల్డ్ కప్ ఆడటానికి వెళ్తున్నాడంటే, అది అతని 27 ఏళ్ల కల. అలాంటి కలను మీరు ఒక్క క్షణంలో చిదిమేశారు. దేశం కోసం త్యాగం చేయమంటే ఎవరైనా చేస్తారు, కానీ కారణం సరిగ్గా చెప్పాలి కదా? అని సలావుద్దీన్ ప్రశ్నించారు. ఈ వార్త విన్న తర్వాత తమ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు దాదాపు ఐదు రోజుల పాటు మానసిక కోమాలోకి వెళ్లారని, వారు పూర్తిగా కుంగిపోయారని కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇచ్చి ఉంటే ఆటగాళ్లను మానసిక సిద్ధం చేసేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా సరిహద్దు సమస్యలు, రాజకీయ మార్పుల వల్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం క్రీడలపై పడటం దురదృష్టకరం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులోని అంతర్గత రాజకీయాలు, ప్రభుత్వ జోక్యం వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లు తమ కెరీర్ లోనే అతి ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్ ప్లేస్ లో ఆడుతుండగా, బంగ్లాదేశ్ అభిమానులు మాత్రం తమ బోర్డు చేసిన పనికి సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us