T20 World Cup 2026 : మా సంజూ భయ్యాను దించండి.. అభిషేక్ శర్మ వైఫల్యాలపై సోషల్ మీడియాలో రచ్చ

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఫామ్ ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లోనూ అతను క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.

T20 World Cup 2026 : మా సంజూ భయ్యాను దించండి.. అభిషేక్ శర్మ వైఫల్యాలపై సోషల్ మీడియాలో రచ్చ
T20 World Cup 2026 (6)

Updated on: Feb 18, 2026 | 8:35 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఫామ్ ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లోనూ అతను క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లోనైనా పరుగులు సాధిస్తాడని గంపెడు ఆశలు పెట్టుకుంటే మళ్ళీ సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరిగి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం విశేషం. నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు బంతులు ఆడిన అభిషేక్, క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు.

అభిషేక్ శర్మ గణాంకాలు చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ వరల్డ్ కప్‌లో అమెరికా, పాకిస్థాన్‌పై సున్నాకే అవుట్ అయిన అతను, ఇప్పుడు నెదర్లాండ్స్‌పై కూడా ఖాతా ఓపెన్ చేయలేకపోయాడు. కేవలం ఈ టోర్నీలోనే కాదు, గత ఎనిమిది అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో బౌలర్లను భయపెట్టిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, టీమిండియా జెర్సీలో మాత్రం ఒత్తిడికి గురవుతున్నాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. వరల్డ్ కప్ లాంటి పెద్ద వేదికపై వరుసగా మూడు సార్లు డకౌట్ కావడం చూస్తుంటే అతని కెరీర్‌లోనే ఇది ఒక చీకటి రికార్డుగా నిలిచిపోనుంది.

మరోవైపు అభిషేక్ వరుస వైఫల్యాలతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని స్థానంలో బెంచ్‌కే పరిమితమైన సంజూ శామ్సన్ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి వరల్డ్ కప్ కంటే ముందు సంజూనే మొదటి ఛాయిస్ ఓపెనర్‌గా ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ సిరీస్‌లో ఫెయిల్ అవ్వడంతో అతని స్థానాన్ని ఈషాన్ కిషన్ భర్తీ చేశాడు. ప్రస్తుతం ఈషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్‌-8 రౌండ్ లాంటి కీలక దశలో అనుభవం ఉన్న సంజూ శామ్సన్‌ను ఓపెనర్‌గా పంపడం బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సూపర్‌-8లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఓపెనింగ్ సమస్య టీమ్ మేనేజ్మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, వరుసగా డకౌట్లు అవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశమే. మరి కీలకమైన సూపర్‌-8 మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇస్తారా లేక సంజూ శామ్సన్‌ను రంగంలోకి దించుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న అభిషేక్, ఇప్పుడు జట్టుకు భారంగా మారుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us