Team India: ఆ 36 బంతులే టీమిండియా ఓటమికి కారణమా.. అసలు జట్టులో ‘మ్యాచ్ విన్నర్’ ఎక్కడ?

|

Nov 11, 2022 | 5:14 PM

ఫైనల్‌కు ఒక్క అడుగులో భారత్‌ దూరమైపోవడానికి ఆ 36 బంతులే కారణమా..? టీమిండియా ఓటమికి కారణమైన ఆ ఫ్యాక్టర్స్ ఏంటి..?

Team India: ఆ 36 బంతులే టీమిండియా ఓటమికి కారణమా.. అసలు జట్టులో మ్యాచ్ విన్నర్ ఎక్కడ?
Team India
Follow us on

అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. హార్దిక్ పాండ్యా(63) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేయగా, బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక్కడ మెదిలే ప్రశ్న ఏంటంటే.. ఫైనల్‌కు ఒక్క అడుగులో భారత్‌ దూరమైపోవడానికి ఆ 36 బంతులే కారణమా..?

పవర్(లెస్) ప్లే..

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మొదటి 6 ఓవర్లకు(పవర్ ప్లే) భారత్ ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. అటు ఇంగ్లాండ్ ఇదే పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. దీన్ని బట్టి చూస్తే భారత ఓపెనర్లు పిచ్‌ను అర్థం చేసుకోవడంలో పొరబడ్డారని చెప్పవచ్చు. బ్యాట్స్‌మెన్‌కు సహాయపడే పిచ్‌పై.. అది కూడా పవర్ ప్లేలో టీమిండియా బాగా డిఫెన్సివ్‌గా ఆడింది. ఆరంభంలో వికెట్లను కాపాడుకోవడం, చివరి ఓవర్లలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలన్న స్ట్రాటజీతో భారత్ ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకుని బరిలోకి దిగింది. చివరి ఓవర్లలో(17-20) అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఉన్నందున ఈ విధానం టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్‌కు అనుకూలంగా మారింది.

మరి అలాంటప్పుడు చివరి 17 బంతుల్లో 50 పరుగులు చేసిన తర్వాత కూడా టీమిండియా కేవలం అబోవ్-పార్ స్కోర్ మాత్రమే చేయగలిగిందంటే.. ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. అదే పవర్ ‘లెస్’ ప్లే. టీమిండియా ఆదిలోని వికెట్ కోల్పోవడం.. రోహిత్ శర్మ స్లో ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ కుదురుకోవడంతో పవర్ ప్లే ఓవర్లలో భారత్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. ”పవర్ ప్లేను ఏ జట్టైనా సరిగ్గా వినియోగించుకోవాలి. ఆ సమయంలో పరుగులు సాధించగలిగితే.. గెలుపుపై ధీమా ఉన్నట్లే”. కాగా, T20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు పవర్‌ప్లే రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ టోర్నీలో భారత్ పవర్‌ప్లేలో కేవలం 6.02 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. యూఏఈ తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన ఇదే.

మ్యాచ్ విన్నర్..’మణికట్టు’ స్పిన్నర్ ఎక్కడ.?

కీలక వికెట్ టేకర్ అయిన యుజ్వేంద్ర చాహల్‌కు.. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. సీనియర్ ప్లేయర్ అశ్విన్‌పై నమ్మకం ఉంచిందే తప్ప.. చాహల్‌ను ఒక్క మ్యాచ్‌లోనూ తీసుకోలేదు. పవర్ ప్లే ఓవర్లలో ప్రత్యర్ధులను కట్టడి చేయాలంటే.. వికెట్లు తీయడం చాలా ముఖ్యం. సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి ఓవర్లలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్లను చితక్కొట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. నాలుగో ఓవర్‌లో స్పిన్‌ను ఉపయోగించినప్పటికీ అక్షర్ పటేల్ బంతిని పెద్దగా టర్న్ చేయలేకపోయాడు. అతడి బౌలింగ్‌ సరైన దిశలో లేకపోవడమే కాదు.. వేగం కూడా తగ్గిందని.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటరీ చేస్తోన్న రవిశాస్త్రి అన్నాడు. “వికెట్లు తీయడానికి మణికట్టు స్పిన్నర్ చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు భారత్ జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్ కూడా లేడు. ఉన్న ఒక్కడూ పెవిలియన్‌లో కూర్చున్నాడు” అని పేర్కొన్నాడు.

భారత్ బ్యాటింగ్‌ చేస్తోన్న సమయంలో ఇంగ్లాండ్ తమ స్పిన్నర్లతో స్కోర్‌ను నియంత్రించింది. ఆదిల్ రషీద్ మాత్రమే కాకుండా లియామ్ లివింగ్‌స్టన్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. ప్రత్యర్ధులను కట్టడి చేశాడు. మన జట్టులో అక్షర్ పటేల్, అశ్విన్ 6 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 57 పరుగులు ఇచ్చారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చాహల్‌ను భారత్ జట్టులోకి తీసుకోనప్పుడు.. సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఎంపికైనా.. చాహల్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఇవ్వలేదు. అది కూడా అక్కడి పిచ్‌పై పటేల్‌, అశ్విన్‌లు పేలవమైన బౌలింగ్‌ చేస్తున్నప్పుడు కూడా టీం మేనేజ్‌మెంట్ చాహల్‌ను తీసుకోవడంపై అస్సలు ఆలోచించలేదు.

కాగా, టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బౌలింగ్ లోపం క్లియర్‌గా కనిపించందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇతర దేశాలకు చెందిన మణికట్టు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, జంపా, రషీద్ ఖాన్, హసరంగా అద్భుతంగా రాణిస్తే.. మన టీంలో సెలెక్ట్ చేసిన చాహల్‌ను టీం మేనేజ్‌మెంట్ ఎందుకు బెంచ్‌కే పరిమితం చేసిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. డ్రింక్స్ కోసమే జట్టులోకి తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.