T20 World Cup 2021: మన దేశంలో క్రికెట్ ఒక మతం. సినిమా తరువాత ఎక్కువగా ప్రజలు ఇష్టపడేది క్రికెట్టే. మహమ్మారులు.. ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా కానీయండి క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు అనుకునే వారికి కొదువ లేదు. అందుకే కరోనా దేశవ్యాప్తంగా విరుచుకుపడుతున్నా సరే.. ఐపీఎల్ నడిపించేయటానికే ప్రయత్నించారు. మైదానంలో జనం లేకపోయినా ఫర్వాలేదు.. టీవీల్లో చూస్తే చాలనేది బీసీసీఐ లెక్క. అదీ నిజమే. ఎందుకంటే.. ఒక్క ఐపీఎల్ సీజన్ కు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట బీసీసీఐకి. ప్రభుత్వానికి టాక్స్ లు బాగానే వస్తాయి. అయితే, ఇంతలో ఆటగాళ్ళు కరోనా బారిన పడటంతో లీగ్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. సరే కథ అక్కడితో ఆగిపోలేదు. ఈ సంవత్సరం మన దేశంలోనే టీ20 ప్రపంచ కప్ సమరం జరగాల్సి ఉంది. ఇప్పుడు ఐపీఎల్ రద్దుతో ఆ టోర్నీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో మనదేశంలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్ళు వస్తారా అనేది పెద్ద ప్రశ్న. 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ప్రతి దేశం నుంచి ఇక్కడికి రావలంట్ ఆంక్షలు పెడుతూ వస్తున్నాయి. దాదాపుగా చాలా దేశాలు తమ పౌరుల్ని కూడా ఇండియా నుంచి వచ్చేయమని కోరుతున్నాయి. అలాగే చాలా దేశాలు విమానాలనూ రద్దు చేశాయి. అయితే, టోర్నీకి ఇంకా ఆరునెలల సమయం ఉంది కాబట్టి, అప్పటికి పరిస్థితులు చక్కబదతాయనే భావనలో ఉన్నారు బీసీసీఐ పెద్దలు. కానీ, విదేశీ క్రికెటర్లు ఇప్పటికే ఇండియాలోని పరిస్థితులకు భయపడ్డారు. ఐపీఎల్ లో తమలో కొద్దిమందికి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన వారికి పూర్తిగా ధైర్యం పోయింది.
గత సంవత్సరం జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ వాయిదా పడింది. అప్పుడు ఈ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. నిజానికి ఆ సమయంలో ఆస్ట్రేలియాలో కేసులు పెద్దగా లేవు. అయినా టోర్నీ వాయిదా వేసేశారు. మరిప్పుడు సీన్ భారత్ కు వచ్చింది. ఇక్కడ కరోనా అదుపుతప్పి నాట్యం చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ టోర్నీ నిర్వహించడం.. దానికి విదేశీ జట్లు రావడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం కాకపొతే, ఏం చేస్తారు? ఈసారి కూడా వాయిదా వేస్తారా? లేక ప్రత్యామ్నాయ వేదిక కోసం చూస్తారా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. ఈ సంవత్సరం టీ20 టోర్నీ యూఏఈ లో జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకూ క్రికెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం టోర్నీ భారత్ లో లేనట్టే. ఒకవేళ యూఏఈ లో పెట్టినా బీసీసీఐకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అక్కడ నిర్వహణ బాధ్యత కూడా బీసీసీఐ చూస్తుంది కనుక. ఒకవేళ అక్కడ మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించే పరిస్థితి వస్తే ఆ టికెట్ల డబ్బులు బీసీసీఐ జేబులోకే వస్తాయి. అందుకే, ప్రత్యామ్నాయానికి బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: IPL POSTPONED: ఐపీఎల్ మ్యాచ్‌ల వాయిదాతో తీరని నష్టం.. బీసీసీఐకి లాస్ ఎంతంటే?
IPL 2021: ‘ఈ సాలా కప్ నమదే’ నిజం చేస్తారనుకుంటే.. ఇలా అయిందేనట్రా.! నెట్టింట్లో పేలుతున్న జోకులు..