T20 World Cup 2021, Ind vs Pak: టీ 20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తోనే ఇరు జట్లు టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టునున్నాయి. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఎల్లప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ముఖాముఖిగా 5 సార్లు తలపడ్డాయి. ఇందులో 5-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. కానీ, మంచి రికార్డ్ కలిగి ఉంది కదా అని ప్రత్యర్థిని తేలికగా తీసుకోవడం మంచిదికాదు. పాకిస్తాన్ ప్రస్తుత జట్టులో ముగ్గురు భారత్‌కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాబర్ అజమ్: భారత్‌కు అతి పెద్ద ముప్పు అంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఎందుకంటే అతని ప్రస్తుత ఫాం. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో అతను అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. అలాగనే టీ20 వరల్డ్ కప్ యూఏఈలో జరుగుతోందని మనం మర్చిపోకూడదు. ఇక్కడ పిచ్‌లపై టీ20 ఇంటర్నేషనల్‌లో 16 అర్ధ సెంచరీలు సాధించిన లిస్టులో ఈ పాక్ కెప్టెన్ అగ్రస్థానంలో ఉంటాడు. 2016 లో ఆడిన చివరి టీ 20 వరల్డ్ కప్ తర్వాత బాబర్ అజామ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ కాలంలో బాబర్ అజామ్ 2204 పరుగులు పూర్తి చేశాడు.
షాదాబ్ ఖాన్: భారత్‌కు మరో పెద్ద ముప్పు పాకిస్థాన్ వైస్ కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అయ్యే అవకాశం ఉంది. 216 వరల్డ్ కప్ నుంచి రషీద్, చాహల్ తర్వాత అతను టీ 20 ఇంటర్నేషనల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ గురించి మాట్లాడితే, 2016 టీ 20 ప్రపంచకప్ తర్వాత ఇప్పటివరకు షాదాబ్ ఖాన్ మిడిల్ ఓవర్లలో 51 వికెట్లు పడగొట్టాడు.
హసన్ అలీ: టీమిండియాకు మూడో ముప్పు పాకిస్థాన్‌కు చెందిన హసన్ అలీ రూపంలో రావొచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీశాడు. ఈ ఏడాది అతను 11 టీ 20 ల్లో 17 వికెట్లు తీశాడు. వాస్తవానికి, అతనికి భారత్‌పై టీ 20 ఆడిన అనుభవం లేదు. కానీ యూఏఈ పిచ్‌లపై ఆడి, వికెట్లు తీసిన మంచి అనుభవం ఉంది.