T20 World Cup 2021, IND vs NZ: టీ20 ప్రపంచకప్ 2021లో రెండో మ్యాచ్‌కు ముందు భారత్‌కు న్యూజిలాండ్ నుంచి హెచ్చరిక అందింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది మాదిరిగానే ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్ బలహీనతను సద్వినియోగం చేసుకుంటానని కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల షాహీన్ తన తొలి రెండు ఓవర్లలోనే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే బోల్ట్ ప్రకటన తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. షాహీన్‌లా బౌలింగ్ చేయాలనుకుంటే టీమ్ ఇండియా ఎదురుదాడిపై దృష్టి సారిస్తుందని విలేకరులతో అన్నాడు.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు బౌల్ట్ మాట్లాడుతూ, ‘షాహీన్‌ను ఎడమచేతి వాటం బౌలర్‌గా చూడటం అద్భుతంగా ఉంది. ఆ రోజు షాహీన్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. నా బంతి కూడా కొంచెం స్వింగ్ అవుతుంది. దీంతో భారత్ మ్యాచులో షాహీన్ చేసిన పనిని నేను చేయగలనని ఆశిస్తున్నాను. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌తో సహా బోల్ట్ చాలాసార్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్‌లో, అతను కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా పెవిలియన్ చేర్చాడు. సహచర పేసర్ మాట్ హెన్రీ.. రోహిత్, రాహుల్‌లకు పెవిలియన్‌కు దారి చూపించాడు.
భారత బ్యాటింగ్ గురించి బోల్ట్ మాట్లాడుతూ..
భారత్‌కు గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కాబట్టి బౌలింగ్ గ్రూప్‌గా మాకు ఇన్నింగ్స్ ప్రారంభంలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. భారత్‌పై ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వారికి గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉంది. వారి ఆటగాళ్లను ఎలా ఆపాలనే దానిపై మా ప్లేయింగ్ ఎలెవన్‌తో మేము స్పష్టంగా ఉండాలి. భారత్‌తో తలపడేందుకు జట్టు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. పాకిస్థాన్‌పై అద్భుతంగా ఆరంభం చేయడంలో విఫలమయ్యాం. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు చాలా మంచి క్రికెట్ ఆడుతోంది.
కోహ్లి సమాధానం..
అదే సమయంలో ఈ విషయంలో విరాట్ కోహ్లి కూడా ధీటుగా సమాధానమిచ్చాడు. కచ్చితంగా గొప్ప బౌలర్లను ఎదుర్కొంటాం. మనం మైదానంలోకి ఎలా వెళ్తాం, మానసికంగా మనం ఏ స్థితిలో ఉన్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను షాహీన్ లాగా బౌలింగ్ చేయాలనుకుంటే మాత్రం, మేం అతనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. మేము బౌల్డ్‌తో చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాం.
ఐసీసీ టోర్నీలో భారత్‌పై ఓడిపోని న్యూజిలాండ్..
ఓడీఐ ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి ఇటీవలి జరిగిన ఐసీసీ టోర్నమెంట్‌లలో న్యూజిలాండ్ టీం భారత్‌పై ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మేరకు బౌల్ట్ మాట్లాడుతూ, ‘మాకు కాస్త పైచేయి ఉంటుందని నేను చెప్పను. రెండు జట్లలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లు ఇక్కడ ఐపీఎల్‌లో ఆడారు. వారికి భారత ఆటగాళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. మేం రేపు మంచిగా రాణిస్తామని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు.
Also Read: French Open: సెమీఫైనల్‌ల్లో ఓడిన పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగిసిన భారత ప్రయాణం..!