T20 World Cup 2021: ICC T20 వరల్డ్ కప్-2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మరోసారి న్యూజిలాండ్‌కి నిరాశే మిగిలింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా రెండోసారి ఫైనల్‌కు చేరి తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు మొదటిసారి T20 ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడుతోంది కానీ గెలవలేకపోయింది. ఓటమికి, గెలుపుకు కారణాల గురించి తెలుసుకుందాం.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ ఆస్ట్రేలియన్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. పరుగుల కట్టడిని అడ్డుకున్నారు. ఆరంభ ఓవర్లలో పరుగులు చేయడానికి అనుమతించలేదు. న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం వేగంగా స్కోర్ చేసి జట్టును 172 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఓపెనర్లు బాగా ఆడినట్లయితే జట్టు స్కోరు సులభంగా 190కి చేరుకునేది. పవర్‌ప్లేలో న్యూజిలాండ్ కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను ఔట్ చేయకపోవడం కూడా న్యూజిలాండ్ ఓటమికి పెద్ద కారణం. న్యూజిలాండ్ మూడో ఓవర్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను అవుట్ చేసింది కానీ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ల జోడీని విడగొట్టడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ చేసి మార్ష్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ కివీస్ జట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
ఈ టోర్నీకి ముందు అతను పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నాడు కానీ ఇందులో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. ఫైనల్‌లో ఫించ్ తొందరగానే ఔట్ అయినప్పుడు వార్నర్ ఆ బాధ్యతను స్వీకరించాడు. జట్టును ఒత్తిడికి గురికానివ్వలేదు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిచెల్ మార్ష్ కూడా నంబర్-3 స్థానంలో వచ్చి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ను అందించాడు. 50 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అజేయంగా 77 పరుగులు చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ కూడా ఆస్ట్రేలియా విజయానికి కీలకమైన హీరోలలో ఒకరు. అతను చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం16 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. అందులో ఓపెనర్ డార్లీ మిచెల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్, ప్రమాదకరమైన గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు ఉన్నాయి.