
Suryakumar Yadav on Sanju Samson: భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడు సంజూ శాంసన్. ఫామ్ సమస్యల కారణంగా ప్లేయింగ్ XI నుంచి తప్పించబడే పరిస్థితి వచ్చినా, అవకాశాన్ని అందిపుచ్చుకుని మ్యాచ్ విన్నింగ్ 97 పరుగులతో జట్టును గెలిపించాడు.
ఒకవైపు వికెట్లు పడుతుండగా, మరోవైపు సంజూ నిలకడగా ఆడుతూ జట్టును లక్ష్యానికి చేర్చాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, “ఇది చాలా మంచి ఫీలింగ్. మేం ఎలా ఆడామో చూసుకుంటే గర్వంగా ఉంది. ఇది క్వార్టర్ ఫైనల్ లాంటి ‘డూ ఆర్ డై’ మ్యాచ్. అబ్బాయిలు చూపిన కేరెక్టర్ అద్భుతం. నేను ఎప్పుడూ చెబుతాను, మంచి మనుషులకు మంచి జరుగుతుంది. సంజూ చాలా సహనంతో ఎదురుచూశాడు. జట్టులో లేకపోయినా, వెనుకపడ్డ సమయంలో ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టానికి ఇప్పుడు సరైన సమయంలో ఫలితం దొరికింది. అతను ఆడిన తీరు జట్టును పూర్తిగా గెలిపించింది” అని అన్నాడు.
అలాగే, సూర్యకుమార్ బౌలర్లను కూడా అభినందించాడు. “అందరూ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఈడెన్ గార్డెన్స్‌లో మంచు (dew) కారణంగా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించడం సాధ్యమేనని మాకు తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి బాగా బ్యాట్‌కు వస్తుంది. చిన్న చిన్న భాగస్వామ్యాలు మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాయి” అని తెలిపాడు.
సెమీఫైనల్ గురించి మాట్లాడుతూ, “సెమీఫైనల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచే మేం ఇక్కడికి రావడానికి అర్హులమేనని అనిపించింది. ఇప్పుడు ముంబైలో మ్యాచ్ ఉండటం ప్రత్యేకం. కానీ ఇప్పుడే ఆలోచించం. విశ్రాంతి తీసుకుని ముంబై చేరిన తర్వాత వ్యూహాలపై దృష్టి పెడతాం. అంచనాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ మైదానంలో జట్టుగా ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం” అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
సంజూ శాంసన్‌పై వచ్చిన సందేహాలకు ఈ ఇన్నింగ్స్ సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు సెమీఫైనల్‌లో టీమిండియా అదే జోష్ కొనసాగించగలదా అన్నదే ఆసక్తికరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..