SA20 2026 Winner : సిక్సర్లతో ముగించిన సన్‌రైజర్స్ కెప్టెన్..మూడోసారి SA20 ఛాంపియన్‌గా కావ్యా మారన్ టీమ్

SA20 2026 Winner : సౌతాఫ్రికా గడ్డ పై కావ్యా మారన్ సేన మరోసారి జయకేతనం ఎగురవేసింది. SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతూ మూడోసారి ఛాంపియన్‎గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ట్రోఫిని ముద్దాడింది. గత సీజన్ ఫైనల్లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి పట్టుదలతో పోరాడి సొంతం చేసుకుంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ వీరోచిత ఇన్నింగ్స్ సన్‌రైజర్స్‌ను విజేతగా నిలబెట్టింది.

SA20 2026 Winner : సిక్సర్లతో ముగించిన సన్‌రైజర్స్ కెప్టెన్..మూడోసారి SA20 ఛాంపియన్‌గా కావ్యా మారన్ టీమ్
Sunrisers Eastern Cape

Updated on: Jan 26, 2026 | 6:30 AM

SA20 2026 : నిజమైన ఛాంపియన్ అంటే పడిలేచిన కెరటంలా ఉండాలి. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు సరిగ్గా అదే చేసి చూపించింది. SA20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న సన్‌రైజర్స్, నాలుగో సీజన్‌లో మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం కేప్‌టౌన్‌లో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ప్రిటోరియా స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ కేవలం 56 బంతుల్లో 101 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఫైనల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినా, అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. సన్‌రైజర్స్ పేసర్ మార్కో జాన్సెన్ కేవలం 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో ప్రిటోరియా 158 పరుగులకే పరిమితమైంది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు విజయంపై అభిమానులకు అనుమానాలు మొదలయ్యాయి. కానీ కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్, మాథ్యూ బ్రీత్జ్కే అద్భుతమైన పట్టుదలతో పోరాడారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ నెమ్మదిగా స్కోరు బోర్డును పరిగెత్తించారు. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు కావాల్సిన దశలో, 19వ ఓవర్‌లో బ్రీత్జ్కే కీలకమైన ఫోర్ కొట్టి ఉత్కంఠను పెంచాడు.

చివరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ స్టబ్స్ తొలి రెండు బంతులనే భారీ సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. స్టబ్స్ (63 నాటౌట్), బ్రీత్జ్కే (68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజేతగా నిలిపారు. స్టాండ్స్‌లో ఉన్న జట్టు యజమాని కావ్యా మారన్ తన టీమ్ గెలుపును చూసి ఆనందంతో చిందులు వేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన విజయాలు అందుకోలేకపోయినా, సౌతాఫ్రికా లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఒక లెజెండరీ టీమ్‌గా అవతరించింది. 4 సీజన్లలోనూ ఫైనల్ చేరడం, అందులో మూడు సార్లు ట్రోఫీ గెలవడం సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ సత్తాను చాటుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..