Sunil Gavaskar : అది అస్సలు కారణమే కాదు.. సరిహద్దుల్లో సైనికులు చలేస్తుందంటారా.. బుమ్రాకు చురకలంటించిన గవాస్కర్

జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా కొన్ని టెస్టులకు దూరం కావడంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ సిరాజ్‌ను ప్రశంసిస్తూ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనే పదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.ఆ పదాన్ని డిక్షనరీ నుంచి తీసేయాలంటూ క్రికెటర్లకు సూచించారు.

Sunil Gavaskar :  అది అస్సలు కారణమే కాదు.. సరిహద్దుల్లో సైనికులు చలేస్తుందంటారా.. బుమ్రాకు చురకలంటించిన గవాస్కర్
Sunil Gavaskar

Updated on: Aug 05, 2025 | 6:55 PM

Sunil Gavaskar : ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వర్క్‌లోడ్ కారణంగా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బుమ్రా ఫిట్‌గా ఉన్నప్పటికీ కీలకమైన టెస్ట్ మ్యాచ్‌లు ఆడకపోవడంపై వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పై పెద్ద చర్చ మొదలైంది. చాలామంది మాజీ క్రికెటర్లు దీనిపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా చేరారు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనే పదం భారత క్రికెట్ నిఘంటువు నుండి శాశ్వతంగా తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సిరీస్‌లోని ఐదు టెస్టులలో ఆడి, మొత్తం 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి 23 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్టులో కూడా ఆడలేకపోయాడు. ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్ తాను బుమ్రాను విమర్శించడం లేదని, ఇది గాయాల నిర్వహణకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. కానీ, ఆయన చేసిన తదుపరి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

గవాస్కర్ మాట్లాడుతూ.. “మీరు మీ దేశం కోసం ఆడుతున్నప్పుడు, నొప్పి, ఇబ్బందులను మర్చిపోండి. సరిహద్దుల్లో సైనికులు చలి పెడుతుందని ఫిర్యాదు చేస్తారా ? రిషభ్ పంత్ కాలుకి ఫ్రాక్చర్ అయినప్పటికీ అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆటగాళ్ల నుంచి ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తారు. భారత్ తరపున క్రికెట్ ఆడటం ఒక గౌరవం. మీరు 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహ్మద్ సిరాజ్‌లో మేము చూసింది అదే. సిరాజ్ మనస్ఫూర్తిగా బౌలింగ్ చేశాడు. అతను వర్క్ లోడ్ అనే పదాన్ని శాశ్వతంగా తొలగించేశాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో అతను నిరంతరం 7-8 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఎందుకంటే కెప్టెన్, దేశం అతని నుంచి అదే ఆశిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. క్రికెట్ వర్గాల్లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పై కొత్త చర్చను లేవనెత్తుతున్నాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..