ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి టీ 20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అజేయంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు. 17 ఫోర్లు,17 సిక్సర్లు బాదాడు. సుబోధ్ భాటి 34 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సాయంతో 170 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేటు 259గా ఉంది. ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్న సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాతితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. ఢిల్లీ ఎలెవన్ లక్ష్యానికి ప్రతిస్పందనగా సింబా జట్టు 18 వ ఓవర్లో 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. 57 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టి 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ సుబోధ్ భాటి అని మీడియా కథనాల్లో చెబుతున్నప్పటికీ ఇది నిజం కాదు. ఆయనకు ముందు శ్రీలంక క్రికెటర్ ధనుకా పాతిరానా ఈ ఘనత సాధించాడు. 2007 లో ఇంగ్లాండ్‌లో జరిగిన లాంక్షైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో ఆస్టర్‌ల్యాండ్స్ తరఫున ఆడుతున్నప్పుడు శ్రీలంకకు చెందిన ధనుకా పతిరానా 72 బంతుల్లో 277 పరుగులు చేశాడు. పతిరానా తన ఇన్నింగ్స్‌లో 29 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌తో ఆస్టర్‌ల్యాండ్స్ జట్టు రెండు వికెట్లకు 366 పరుగులు చేసింది.
సుబోధ్ కెరీర్..
సుబోధ్ భాటి (30) మొదట ఉత్తర ప్రదేశ్ కు చెందినవాడు కానీ ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు. అతను ఆల్ రౌండర్. ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరఫున 147 పరుగులు చేసి 19 వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను 24 లిస్ట్ ఎ మ్యాచ్లలో 132 పరుగులు, 37 వికెట్లు తీశాడు. అతను 2015 సంవత్సరంలో దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.