AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hayley Matthews: స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. తిరిగొచ్చి శతకం బాదిన వెస్టిండీస్ కెప్టెన్!

హేలీ మాథ్యూస్ గాయపడిన తర్వాత స్ట్రెచర్‌పై మైదానం వీడి వెళ్లినా, తిరిగి వచ్చి అద్భుతమైన శతకం బాది అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆమె 114 నాటౌట్ స్కోరు చేసి పోరాట స్పూర్తి చాటింది. అయితే వెస్టిండీస్ జట్టు లక్ష్యాన్ని చేరలేక ఓటమి పాలైంది. అయినా, హేలీ చూపిన ధైర్యం, అంకితభావం అభిమానులను మెప్పించింది.

Hayley Matthews: స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. తిరిగొచ్చి శతకం బాదిన వెస్టిండీస్ కెప్టెన్!
Hayley Matthews
Narsimha
|

Updated on: Apr 10, 2025 | 10:30 AM

Share

ఓ మైదానంలో గాయపడిన క్రికెటర్‌… నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై బయటకు వెళుతుంది… కానీ అదే మ్యాచ్ కోసం తిరిగి బరిలోకి వచ్చి శతకం సాధిస్తుంది! ఇదేమైనా సాధ్యమా? కానీ హేలీ మాథ్యూస్‌ చేసిన ఈ అసాధ్యాన్ని సాద్యం చేసింది. వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా ఉన్న హేలీ, తన పోరాటంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటలో గాయపడినా, తిరిగి మైదానంలోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో సెంచరీ సాధించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో వెస్టిండీస్ తలపడింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తరపున హేలీ మాథ్యూస్ (114 నాటౌట్, 113 బంతుల్లో 14 ఫోర్లు) అద్భుతంగా ఆడింది. జైడా జేమ్స్ (45) తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించింది. కానీ జట్టు మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో హేలీ మైదానంలో తన పోరాటంతో మెప్పించింది.

అయితే ఆమె 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనుకోకుండా గాయపడింది. తన కాలు తడబడడంతో మైదానాన్ని వదిలి స్ట్రెచర్‌పై వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే ఆగిపోలేదు హేలీ ధైర్యం. ప్రాథమిక చికిత్స అనంతరం మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టింది. అప్పటికి ఆమె స్కోరు 99 వద్ద నిలిచింది. శరీరం సహకరించకపోయినా, మనస్సులో మ్యాచ్‌ను ముగించాలన్న పట్టుదలతో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి తన సెంచరీ పూర్తి చేసింది. అలాగే ఆలియా అలీన్ (17) తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది.

అయితే, ఆమె పోరాటానికి, కసికి అనుగుణంగా ఫలితం రాలేదు. వెస్టిండీస్ లక్ష్యాన్ని చేరక పోయింది. జట్టు ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, హేలీ మాథ్యూస్ చూపిన పోరాట స్ఫూర్తి మాత్రం ప్రపంచ క్రికెట్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఒక మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా జట్టు కోసం చేసిన త్యాగం, గాయంతోనూ ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఆమెకి అభిమానులు “హ్యాట్సాఫ్ కెప్టెన్ మేడమ్!” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలాంటి ఆటగాళ్లే నిజంగా క్రికెట్ గుండెను కొట్టేలా చేస్తారు. శరీరం సహకరించకపోయినా, మనస్సు మాత్రం ఆటలో నిలబెట్టిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా హేలీ మాథ్యూస్‌ నిలిచింది. ఇది కేవలం ఓ సెంచరీ కాదు, ఒక స్ఫూర్తి శతకం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..