SRH vs GT Playing XI IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో వీరికి చోటు?
ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యుత్తమ జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. గుజరాత్ ఈ సీజన్ నుంచి ఐపీఎల్ అరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాయింట్ల పట్టికలోనూ..
ఎట్టకేలకు శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఐపీఎల్ 2022(IPL 2022)లో తన విజయాల ఖాతాను తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం ద్వారా మొదటి విజయాన్ని దక్కించుకుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఈ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇదే తొలి విజయం. ఈ సీజన్‌లో చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యుత్తమ జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఈ జట్టుతో తలపడనుంది. గుజరాత్ ఈ సీజన్ నుంచి ఐపీఎల్ అరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మూడింటిలోనూ విజయం సాధించింది.
ఈ సీజన్‌లో గుజరాత్‌కు అంతా అనుకూలంగా ఉంది. అయితే, మహ్మద్ షమీ లాంటి బౌలర్‌కు తోడు రషీద్ ఖాన్ ఉన్నాడు. అదే సమయంలో జట్టు బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు.ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఈ బ్యాట్స్‌మెన్ అద్భుత అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్ తెవాటియా లాంటి ఫినిషర్ కూడా ఉన్నాడు. పంజాబ్‌పై చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
మాథ్యూ వేడ్ బయటకు..
సన్‌రాజర్స్‌పై గుజరాత్ ఈ ఫామ్‌ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. పంజాబ్‌పై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. గత మ్యాచ్‌లో సాయి సుదర్శన్, దర్శన్ నలకండే అరంగేట్రం చేశారు. సాయి సుదర్శన్ తన బ్యాటింగ్‌తో చాలా ఆకట్టుకున్నాడు. అందుకే అతను జట్టులో కొనసాగడం పక్కా. మరోవైపు, దర్శన్‌కు మరో అవకాశం ఇవ్వాలని పాండ్యా కోరుతున్నాడు. అయితే జట్టులో ఒక మార్పు రావచ్చని తెలుస్తోంది. మాథ్యూ వేడ్ ఇంకా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతని స్థానంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌కు అవకాశం దక్కవచ్చు. వికెట్ కీపర్, తుఫాను బ్యాటింగ్ చేయడం ప్రసిద్ధి చెందాడు.
సన్‌రైజర్స్ జట్టులో ఎలాంటి మార్పు ఉండదు..
మరోవైపు, సన్‌రైజర్స్ జట్టు చూస్తే, చెన్నైపై రెండు మార్పులతో బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్ జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో శశాంక్ సింగ్‌కు కూడా అవకాశం దక్కింది. అయితే శశాంక్ బ్యాటింగ్ మాత్రం రాలేదు. అలాగని వీరిని బయటకు తీయలేం. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని, తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు.
రెండు జట్ల ప్లేయింగ్ XI:
సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్ (కెప్టెన్) అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.
గుజరాత్ టైటాన్స్ – హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే.