
LSG vs SRH IPL 2026 : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక వింత సంఘటనకు వేదికైంది. కేవలం ఒకే ఒక్క పొరపాటు.. ఒక చిన్న అజ్ఞానం వల్ల గెలవాల్సిన మ్యాచ్‌ను కావ్యా మారన్ టీమ్ చేజార్చుకుంది. లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, రూల్ బుక్ ప్రకారం చూస్తే అసలు గెలవాల్సింది హైదరాబాద్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మైదానంలో ఏం జరిగింది? ఆవేశ్ ఖాన్ చేసిన తప్పేంటో వివరంగా తెలుసుకుందాం.
లక్నో విజయానికి చివరి రెండు బంతుల్లో ఒకే ఒక్క పరుగు కావాలి. క్రీజులో రిషబ్ పంత్ ఉన్నాడు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతిని పంత్ బౌండరీ వైపు కొట్టాడు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. బౌండరీ లైన్ బయట ఫీల్డింగ్ కోసం సిద్ధంగా ఉన్న లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్, ఆ బంతి లైన్ దాటకముందే తన బ్యాట్‌తో అడ్డుకున్నాడు. ఉత్సాహంలో చేసిన ఈ పని క్రికెట్ నిబంధనల ప్రకారం పెద్ద నేరం. కానీ, సన్‌రైజర్స్ ప్లేయర్లు దీన్ని గమనించలేకపోయారు.
ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోంది?
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ 20.1 నిబంధన ప్రకారం.. మైదానంలో లేని వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాలి. అంతేకాకుండా, నిబంధన 41 ప్రకారం దీన్ని అన్‌ఫెయిర్ ప్లే (అన్ స్పోర్ట్స్ మన్ లైక్ కాండక్ట్) కింద పరిగణించవచ్చు. ఇలా జరిగినప్పుడు అంపైర్లు ప్రత్యర్థి జట్టుకు (ఇక్కడ హైదరాబాద్‌కి) 5 పరుగులను పెనాల్టీగా గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే లక్నో స్కోరు నుంచి పరుగులు తగ్గడమో లేదా హైదరాబాద్‌కు అదనంగా పరుగులు రావడమో జరగాలి.
అప్పీల్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది
ఒకవేళ సన్‌రైజర్స్ కెప్టెన్ లేదా ఆటగాళ్లు వెంటనే అంపైర్‌కు అప్పీల్ చేసి ఉంటే.. లక్నో సమీకరణం మారిపోయేది. 2 బంతుల్లో 1 పరుగు కొట్టాల్సిన చోట, పెనాల్టీ పడటం వల్ల 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చేది. ఉనాద్కత్ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ముందు ఆఖరి రెండు బంతుల్లో సిక్స్ కొట్టడం అంత సులభం కాదు. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ అప్పీల్ చేయకపోవడంతో అంపైర్లు కూడా పట్టించుకోలేదు. ఫలితంగా లక్నో సులభంగా విజయాన్ని అందుకుంది.
కావ్యా మారన్ టీమ్‌కు రూల్స్ తెలియవా?
కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటున్న ఫ్రాంచైజీలు, రూల్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు స్మార్ట్ కెప్టెన్లు అప్పీల్ చేసి మ్యాచ్‌లను మలుపు తిప్పారు. కానీ హైదరాబాద్ మాత్రం ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఆవేశ్ ఖాన్ చేసిన ఆ చిన్న పొరపాటును క్యాష్ చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆవేశ్ ఖాన్ వీడియో వైరల్ అవుతుండగా, సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం తల పట్టుకుంటున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి