Sourav Ganguly: ఇంగ్లండ్, భారత్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత జట్టు ఇంగ్లండ్‌కు చేరుకుంది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ప్లేయర్స్ మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20 నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బృందం కౌంటీ సెలక్ట్ ఎలెవన్ జట్టుతో ఆడనుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలోనే టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. రిషబ్‌కు యూకే వేరియంట్ లక్షణాలు కనిపించడం టీమిండియాను ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. ఇక పంత్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమని కొన్ని వాదనలు వినిపించాయి.
దీంతో ఈ విషయమై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్‌కు తన మద్ధతు పలికిన దాదా.. ఆటగాళ్లు నిత్యం మాస్కులు ధరించడం కష్టమైన విషయమని అన్నారు. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపిన గంగూలీ.. ఇటీవలే జరిగిన యూరోకప్ 2020, వింబుల్డన్ మ్యాచ్‌లకు చాలావరకు ప్రేక్షకులు మాస్క్ పెట్టుకోకుండానే వచ్చారన్నారు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అనంతరం టీమిండియా ప్లేయర్స్‌కు 20 రోజుల విరామం లభించిందని తెలిపిన గంగూలీ.. ఇంగ్లండ్‌లో నిబంధనలు సడలించడంతో.. మాస్కులు పెట్టుకోకుండా తిరిగారన్నారు. అయినా రోజు మొత్తం మాస్క్ ధరించి బయట తిరగడం ఇబ్బందిగానే ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇక పంత్ ఆరోగ్యం గురించి మాట్లాడిన గంగూలీ.. పంత్ గురించి మేం దిగులు చెందడం లేదన్నారు. అతని ఆరోగ్యం త్వరగానే మెరుగవుతోందని, టెస్టు సిరీస్ ప్రారంభంలోగా పంత్ జట్టుకు అందుబాటులోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Tokyo Olympics 2021: 40 ఏళ్ల కల నెరవేరేనా.. భారత పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు!
టోక్యో ఒలింపిక్స్‌లో శరణార్థుల టీం.. ఒలింపిక్ పతాకంతో బరిలోకి.. ప్రపంచ శాంతి కోసమే అంటోన్న ఐఓసీ