
Shubman Gill : భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ టెస్టులో ఉద్రిక్తతకు అసలు కారణం వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆట చివరి ఓవర్‌లో జరిగిన నాటకీయ పరిణామాల పై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నోరు విప్పారు. గిల్, జాక్ క్రాలీ ఆట స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని, కావాలనే సమయం వృథా చేశాడని ఆరోపించాడు. లార్డ్స్ టెస్టులో ఇరు జట్ల మధ్య తీవ్రమైన స్లెడ్జింగ్ కనిపించింది. మూడో రోజు చివరి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేస్తున్నాడు. అప్పుడే జాక్ క్రాలీ పదేపదే రన్-అప్ సమయంలో వెనక్కి తగ్గి సమయం వృథా చేస్తున్నాడు. దీని వల్ల భారత్‌కు మరో ఓవర్ వేసే అవకాశం రాకుండా చేయాలనేది అతని ఉద్దేశం. ఆ తర్వాత, అతను గ్లవ్స్‌కు బంతి తగిలినట్లు నటించి, మెడికల్ అటెన్షన్‌ను కూడా మైదానంలోకి పిలిచాడు. భారత ఆటగాళ్లు చప్పట్లు కొట్టి అతని నాటకాన్ని ఎగతాళి చేశారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ మైదానంలో చాలా కోపంగా కనిపించాడు.
గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ ఓపెనర్ నిర్దేశిత సమయం కంటే 90 సెకన్లు ఆలస్యంగా క్రీజులోకి వచ్చాడని, రోజంతా సమయం వృథా చేస్తూనే ఉన్నాడని చెప్పాడు. ఈ మొత్తం సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన శుభ్‌మన్ గిల్ ఇలా అన్నాడు.. క్రాలీ కావాలనే సమయాన్ని వృథా చేస్తున్నాడు. ఇది ఆట స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. అంపైర్లు జోక్యం చేసుకోవాల్సింది, కానీ వారు ఏమీ అనలేదు. ఈ పద్ధతి తప్పు కావడంతో నేను నా ఆవేశాన్ని కోల్పోయాను అని చెప్పాడు.
ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్, కోచ్ మార్క్ రామ్‌ప్రకాష్ కూడా ఈ విషయంపై స్పందించారు. గిల్ కోపంగా ఉండటం సరైనదేనని, జాక్ క్రాలీ సమయం వృథా చేయకుండా ఆటను ముందుకు తీసుకెళ్లాల్సిందని ఆయన అన్నారు. రామ్‌ప్రకాష్ ది గార్డియన్ లో ఇలా రాసుకొచ్చాడు.. “రోజు చివరి ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ కొద్దిసేపు ఆగొచ్చు, కానీ ఇంగ్లాండ్ ఈ చర్యతో హద్దులు మీరింది. అంపైర్లు కూడా ఈ మొత్తం విషయంలో ఏమీ అనకుండా, దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది” అని అన్నారు.
శుభ్‌మన్ గిల్ ఇంత దూకుడుగా ఉంటాడని నేను అనుకోలేదు, కానీ అతను తన జట్టుకు గట్టిగా సపోర్టుగా నిలిచాడు. ఇలాంటి సమయాల్లోనే జట్టు ఐక్యత, కెప్టెన్ నాయకత్వం కనిపిస్తాయని రామ్ ప్రకాష్ అన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 23 నుంచి ప్రారంభం కానున్న మాంచెస్టర్ టెస్టుపైనే ఉంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది, భారత్ సిరీస్‌లో తిరిగి రావాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..