కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌! ధోని కూడా వెనకే..

శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ ను ఐపీఎల్ ఫైనల్ కు నడిపించాడు. క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించారు. ఒక సీజన్ లో కెప్టెన్ గా అత్యధిక సిక్సర్లు (39) కొట్టిన రికార్డును సృష్టించాడు. 600 పరుగుల మార్క్ ను కూడా అధిగమించాడు.

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌! ధోని కూడా వెనకే..
Shreyas Iyer And Virat Kohl

Updated on: Jun 02, 2025 | 4:41 PM

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ వ్యూహాలు, బ్యాటింగ్‌ సత్తాతో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో పంజాబ్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. టాస్ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మొదటి క్వాలిఫయర్‌లో ఓటమి ఒక చిన్న పొరపాటు అని, జట్టు దానిని మర్చిపోయిందని అన్నాడు. అన్నట్లే క్వాలిఫైయర్‌ 2లో జట్టును గెలిపించాడు. 41 బాల్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు బాదడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక సీజన్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా అయ్యర్ కొత్త చరిత్ర లిఖించాడు. ప్రస్తుత సీజన్‌లో అయ్యర్‌ 39 సిక్సర్లు బాదాడు. ఒక సీజన్‌లో ఒక కెప్టెన్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో కోహ్లీ కొట్టిన 38 సిక్సర్లను అయ్యర్‌ అధిగమించాడు.

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌ 5 కెప్టెన్లు

  • 39* – శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్‌ కింగ్స్‌), 2025
  • 38 – విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), 2016
  • 31 – డేవిడ్ వార్నర్ (ఎస్‌ఆర్‌హెచ్‌), 2016
  • 30 – ఎంఎస్‌ ధోని (సీఎస్‌కే), 2018
  • 30 – కేఎల్‌ రాహుల్ (పంజాబ్‌ కింగ్స్‌), 2021

ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్ తొలిసారిగా 600 పరుగుల మార్క్‌ దాటాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లినప్పుడు అతను 519 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును కూడా అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టడానికి అయ్యర్‌కు 67 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆ రన్స్‌ చేస్తే కెఎల్ రాహుల్ (670) పేరిట ఉన్న రికార్డును అయ్యర్‌ బద్దలు కొట్టేస్తాడు. మరి ఫైనల్‌లో అయ్యర్‌ 67 రన్స్‌ చేస్తాడో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..