మొహమ్మద్ షమీ రిటైర్మెంట్..? రైట్ టైమ్ అంటూ బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ బౌలర్..
తాజాగా వార్తల్లో నిలిచిన మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నారనే వార్తలను ఖండించారు. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ, తనకు విసుగు వచ్చే వరకు ఆట ఆడుతానని, సరైన సమయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. టీమిండియా భవిష్యత్తుపై అనిశ్చితి ఉన్నప్పటికీ, షమీ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం టీమిండియాలో రిటైర్మెంట్‌ల పరంపర కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టులకు, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలె ప్రకటించిన ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మొహమ్మద్ షమీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై తాజాగా స్పందించిన షమీ.. అలాంటిదేం లేదంటూ గట్టిగానే స్పందించాడు. సరైన టైమ్‌లోనే నేను రిటైర్మెంట్ ప్రకటిస్తానని, ఇప్పుడు ఆ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశాడు.
షమీ మాట్లాడుతూ..‘సరైన సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం వెల్లడిస్తానని, తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం – అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశీయ క్రికెట్ అయినా ఆడుతూనే ఉంటానని‘ అన్నాడు. ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైనందున రాబోయే ఆసియా కప్ కోసం T20I జట్టు నుండి కూడా అతన్ని తొలగించడంతో భారత జట్టుతో అతని భవిష్యత్తుపై సందేహాలు తలెత్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో అతను చివరిసారిగా టీమిండియా తరపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా పెద్దగా రాణించలేదు. దీంతో టీ20 జట్టులోకి అతన్ని సెలెక్టర్లు తీసుకోలేదు.
ఇటీవల పుజారా , అశ్విన్ రిటైర్మెంట్లు , విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మల టెస్ట్, టీ20 రిటైర్మెంట్ల నేపథ్యంలో షమీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. కానీ షమీ మాత్రం తనకు విసుగు వచ్చిన రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తానని అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. “ఎవరికైనా సమస్య ఉంటే, నేను రిటైర్మెంట్ తీసుకుంటే వారి జీవితాలు బాగుపడతాయో చెప్పండి. నేను ఎవరి జీవితానికి అడ్డుగా ఉన్నాను.. నేను రిటైర్ కావాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి? నేను విసుగు చెందిన రోజు, నేను వెళ్లిపోతాను. మీరు నన్ను సెలెక్ట్ చేయకపోయినా నేను కష్టపడి పనిచేస్తూనే ఉంటాను. అంతర్జాతీయంగా ఆడే అవకాశం రాకుంటే దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉంటాను. నేను ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉంటాను.’ అని షమీ రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




