IND vs PAK : అరే మీరు మారరా సామీ..ఐసీసీకే క్లాస్ పీకుతున్న అఫ్రిది..మ్యాచ్ ఆడకపోతే నష్టం ఎవరికో ?

IND vs PAK : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన ఆయన, ఐసీసీ పనితీరుపైనే ప్రశ్నలు కురిపించారు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు మ్యాచ్ జరగనందుకు బాధపడుతున్నానని చెబుతూనే, మరోవైపు తన ప్రభుత్వ మొండి నిర్ణయానికి మద్దతు తెలపడం గమనార్హం.

IND vs PAK : అరే మీరు మారరా సామీ..ఐసీసీకే క్లాస్ పీకుతున్న అఫ్రిది..మ్యాచ్ ఆడకపోతే నష్టం ఎవరికో ?
Ind Vs Pak (4)

Updated on: Feb 02, 2026 | 5:29 PM

IND vs PAK : భారత్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించిన తర్వాత, ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “రాజకీయాలు మూసివేసిన తలుపులను క్రికెట్ తెరుస్తుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. కానీ, ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ భారత్‌తో ఆడకపోవడం బాధాకరం” అని అఫ్రిది తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే వెంటనే ప్లేటు మార్చి, తన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని, దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

అఫ్రిది తన పోస్ట్‌లో ఐసీసీని టార్గెట్ చేసుకున్నారు. ఐసీసీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని, నాయకత్వ లక్షణాలను చూపించాలని డిమాండ్ చేశారు. “ప్రతి సభ్య దేశానికి ఐసీసీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కేవలం మాటలతో కాకుండా చేతలతో న్యాయం చేయాల్సిన సమయం ఇది” అని ఆయన రాసుకొచ్చారు. అంటే భారత్ పాకిస్థాన్‌కు వచ్చి ఆడకపోయినా ఐసీసీ మిన్నకుండిపోతోందనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు రెండు నాల్కల ధోరణిని తలపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకపక్క భారత్-పాక్ మ్యాచ్ లేకపోతే క్రికెట్ ప్రపంచానికి నష్టమని చెబుతూనే, మరోపక్క పాక్ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐసీసీని విమర్శించడం ద్వారా పాకిస్థాన్ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని భారత అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్‌లో రాజకీయాలు తీసుకురావద్దని చెబుతూనే, రాజకీయ నిర్ణయాలను సమర్థించడం అఫ్రిదికే చెల్లిందని ఎద్దేవా చేస్తున్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 1న అధికారికంగా ప్రకటించిన ప్రకారం.. పాక్ జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడుతుంది కానీ, ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో మాత్రం పాల్గొనదు. ఒకవేళ పాక్ గనుక నిజంగానే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే, ఐసీసీ నుంచి ఆ దేశానికి అందే కోట్లాది రూపాయల నిధులు ఆగిపోవడంతో పాటు కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అఫ్రిది మాటలు విని ఐసీసీ ఏమైనా స్పందిస్తుందా లేదా పాక్‌పై వేటు వేస్తుందా అన్నది వేచి చూడాలి.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us