
Sarfaraz Khan IPL Auction 2026: దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఊహించని పెద్ద షాక్ తగిలింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కేవలం రూ.75 లక్షల బేస్ ప్రైస్‌కు కూడా సర్ఫరాజ్‌ను కొనేందుకు ఏ టీమ్ ముందుకు రాలేదు దాంతో అతను వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
ఆక్షన్ ప్రారంభానికి ఒక రోజు ముందు సర్ఫరాజ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 22 బంతుల్లో 73 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టీ20లో కూడా అతను హార్డ్ హిట్టింగ్ చేయగలనని నిరూపించినప్పటికీ, ఫ్రాంచైజీ యజమానులు, మేనేజర్‌లకు ఈ ప్రదర్శన సరిపోలేదని తెలుస్తోంది. అతని ఐపీఎల్ 2026లో ఆడే కల ప్రస్తుతానికి అసంపూర్తిగానే మిగిలిపోయింది.
సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్నాడు. అయినా కూడా అతనికి టీమిండియాలో స్థానం దక్కడం లేదు. దీంతో ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లభిస్తుందని సర్ఫరాజ్, అతని అభిమానులు బలంగా ఆశించారు. కానీ మినీ ఆక్షన్‌లో అతను అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం నిరాశ కలిగించే అంశం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని ప్రదర్శన అత్యద్భుతం. ఈ భారతీయ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌లో అతను 7 మ్యాచుల్లో ఇప్పటివరకు 329 పరుగులు చేశాడు. చివరి రెండు ఇన్నింగ్స్‌లలో అతను వరుసగా అర్ధ సెంచరీలు చేసి తన విధ్వంసక బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. హర్యానాపై అతను చేసిన 64 పరుగుల ఇన్నింగ్స్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో 235 పరుగుల అతిపెద్ద రన్ ఛేజ్‌లో కీలక పాత్ర పోషించింది.
నిరంతరం దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ, ఐపీఎల్ వేలంలో సర్ఫరాజ్‌కు కొనుగోలుదారులు దొరకకపోవడం అతని అభిమానులకు గట్టి ఎదురుదెబ్బ. దేశవాళీ ప్రదర్శనకు తగిన ప్రయోజనం లభించకపోవడంతో, అతను ఇప్పుడు యాక్సిలరేటర్ రౌండ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా ఏ టీమ్ కొనకపోతే, ఐపీఎల్ 2026లో అతను ఆడాలనే కల అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. గత సంవత్సరం నుంచి అతను స్థిరంగా పరుగులు చేస్తున్నప్పటికీ, ఐపీఎల్ టీమ్స్ అతన్ని ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..