
Sanju Samson : ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విషయంలో అతి పెద్ద సంచలనం త్వరలోనే తెరపైకి రాబోతోంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ కావాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2025 మెగా వేలానికి ముందు జోస్ బట్లర్‌ను రిలీజ్ చేసినప్పటి నుంచి ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌తో సంజూ శాంసన్‌కు సంబంధాలు సరిగా లేవని సమాచారం. ఈ క్రమంలో అనేకసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతన్ని ట్రేడ్ చేసుకోవడానికి మరోసారి రేసులోకి దిగింది. రాబోయే రోజుల్లో సంజు శాంసన్ ఏ టీమ్‌లోకి వెళ్తారనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు తనను విడుదల చేయాలని ఫ్రాంచైజీని కోరారు. 2025 మెగా ఆక్షన్ సమయంలో ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను అనూహ్యంగా విడుదల చేయడంతో సంజు శాంసన్, ఫ్రాంచైజీ మధ్య సంబంధాలు క్షీణించాయని తెలుస్తోంది. ఈ కారణంగానే శాంసన్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నారు.
మొదట్లో సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపినప్పటికీ, మధ్యలో రేసు నుంచి తప్పుకుంది. అయితే, ఇప్పుడు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ 2026కు అందుబాటులో ఉంటారని ధృవీకరించిన తర్వాత, సీఎస్కే మరోసారి సంజు ట్రేడ్ రేసులోకి దూకింది. సీఎస్కే ఫ్రాంచైజీ తమ జట్టు రిటెన్షన్ లిస్ట్‌ను ఖరారు చేయడానికి, సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌పై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
సీఎస్కే రిటెన్షన్ లిస్ట్ తయారీలో ఎంఎస్ ధోనీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ధోనీ త్వరలోనే సీఈఓ కాశీ విశ్వనాథన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లతో సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశం నవంబర్ 10, 11 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోనే సంజు శాంసన్ ట్రేడ్ విషయంలో ఫ్రాంచైజీ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడం గురించి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ వివిధ ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతోంది. ఆర్ఆర్ యజమాని మనోజ్ బడాడే శాంసన్ ట్రేడ్ గురించి లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లతో చర్చలు జరుపుతున్నారని క్రిక్‌బజ్ నివేదించింది.
ఆర్ఆర్, సీఎస్కే మేనేజ్‌మెంట్‌ల మధ్య ట్రేడ్ చర్చలు చాలా ముందుకు వెళ్లాయని సమాచారం. దీనికి నిదర్శనంగా సంజు శాంసన్‌కు బదులుగా ఆర్ఆర్ లోకి వెళ్లడానికి తమకు అభ్యంతరం ఉందా అని అడుగుతూ సీఎస్కే మేనేజ్‌మెంట్ తమలోని ఒక టాప్ ప్లేయర్‌కు నోటీస్ కూడా పంపినట్లు నివేదిక వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో ట్రేడ్ డీల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..