Sanju Samson: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. అరుదైన రికార్డుపై కన్నేసిన సంజూ

India vs Ireland T20 Series: ఐర్లాండ్‌తో జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. భారత్-ఐర్లాండ్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవాలంటే రోహిత్ శర్మ పేరిట ఉన్న 201 పరుగుల రికార్డును అధిగమించాల్సి ఉంది. ఈ రికార్డును సంజూ శాంసన్ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Sanju Samson: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. అరుదైన రికార్డుపై కన్నేసిన సంజూ
Sanju Samson
Image Credit source: BCCI

Updated on: Jun 24, 2026 | 1:17 PM

టీమిండియా ఐర్లాండ్ టూర్ జూన్ 26 నుండి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి సంజూ శాంసన్ సిద్ధమయ్యాడు. అయితే దీనికోసం సంజూ.. రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ పెద్ద రికార్డును అధిగమించాల్సి ఉంటుంది. త్వరలో జరిగే టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఐర్లాండ్‌తో 2 మ్యాచ్‌లు ఆడనుంది.

భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌లలో ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. రోహిత్ ఐర్లాండ్‌పై ఆడిన 4 టీ20 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 201 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇప్పుడు ఆడుతున్న ఆటగాళ్లలో సంజూ శాంసన్, ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ మాత్రమే ఈ రికార్డుకు చేరువలో ఉన్నారు.

సంజూకే ఎక్కువ ఛాన్స్..

ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రోహిత్ రికార్డును అధిగమించడానికి ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ కంటే సంజూ శాంసన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హ్యారీ టెక్టర్ ఇప్పటి వరకు భారత్‌పై 5 టీ20 మ్యాచ్‌ల్లో 30.75 సగటు, 123 స్ట్రైక్ రేట్‌తో 123 పరుగులు చేశాడు. రోహిత్ రికార్డును బ్రేక్ చేయాలంటే అతడికి ఇంకా 79 పరుగులు కావాల్సి ఉంది. సంజూ శాంసన్ ఐర్లాండ్‌పై కేవలం 3 టీ20 మ్యాచ్‌ల్లోనే 59.00 సగటు, 171.01 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (201 పరుగులు) రికార్డును బ్రేక్ చేయడానికి సంజూ శాంసన్‌‌కు రానున్న టీ20 సిరీస్‌లో 84 పరుగులు మాత్రమే అవసరం ఉంది. సంజూ ప్రస్తుత ఫామ్, స్ట్రైక్ రేట్ ప్రకారం హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రస్తుత టీమిండియాలో సంజూనే టాప్

ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో, ఐర్లాండ్‌పై టీ20ల్లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సంజూ శాంసన్ మాత్రమే. అతని తర్వాత ఇషాన్ కిషన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ పిచ్‌లపై గతంలో మంచి రికార్డు ఉన్న సంజూ శాంసన్, ఈ రెండు మ్యాచ్‌ల్లో గనుక చెలరేగితే రోహిత్ శర్మ రికార్డును దాటి భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో మోస్ట్ రన్ స్కోరర్‌గా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us