సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్! పద్ధతిగా కొట్టాలంటే వీళ్ల తర్వాతే..

శ్రీలంక 'ఏ'తో రెండో అనధికారిక టెస్టులో భారత్ 'ఏ' బలమైన స్థితిలో నిలిచింది. సాయి సుదర్శన్ అజేయ సెంచరీ, దేవదత్ పడిక్కల్ అజేయ 94 పరుగులతో రెండో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 247/1తో నిలిచి 119 పరుగుల వెనుకబడి ఉంది.

సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్! పద్ధతిగా కొట్టాలంటే వీళ్ల తర్వాతే..
Sai Sudharsan, Devdutt Padi

Updated on: Jul 03, 2026 | 8:21 PM

క్రికెట్ అభిమానులంతా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌పై ఫోకస్ పెడితే, మరోవైపు శ్రీలంకపై మన కుర్రాళ్లు ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ అయితే లంకను ఓ ఆట ఆడుకుంటున్నారు. శ్రీలంక ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అజేయ సెంచరీతో మెరవగా, దేవదత్ పడిక్కల్ 94 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును బలమైన స్థితికి చేర్చాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌లో 247/1 స్కోరు చేసింది. ప్రస్తుతం శ్రీలంక ‘ఏ’ తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే భారత్ ఇంకా 119 పరుగులు వెనుకబడి ఉంది.

రెండో రోజు ఉదయం 288/5 స్కోరుతో ఆట ప్రారంభించిన శ్రీలంక ‘ఏ’ మరో 78 పరుగులు మాత్రమే జోడించి 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహన్ అరచ్చిగే అద్భుతంగా బ్యాటింగ్ చేసి 127 పరుగులు సాధించాడు. అయితే భారత బౌలర్లు చివరి దశలో అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికారు. భారత్ తరఫున గుర్నూర్ బ్రార్, సరాంశ్ జైన్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. చివరి మూడు వికెట్లు కేవలం 12 బంతుల వ్యవధిలోనే కోల్పోవడం శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ‘ఏ’కు ఓపెనర్లు శుభారంభం అందించారు. అమన్ మోఖాడే 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అనంతరం అవుట్ అయినప్పటికీ, ఆ తర్వాత సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇద్దరూ ఓపికగా ఆడుతూ చెడు బంతులను బౌండరీలకు తరలించారు. టీ విరామ సమయానికి భారత్ 111/1తో నిలిచింది. చివరి సెషన్‌లో శ్రీలంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ జోడీ ఆధిపత్యం చెలాయించింది. సాయి సుదర్శన్ 30వ ఓవర్‌లో అర్ధ సెంచరీ పూర్తి చేసి, 56వ ఓవర్‌లో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అతడు 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో 94 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి సెంచరీకి చేరువలో ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఏ’ 247/1 స్కోరుతో నిలిచి, కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. సుదర్శన్-పడిక్కల్ జోడీ మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే భారత్ ‘ఏ’ భారీ ఆధిక్యం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us