IND vs AUS 4th Test: టీమిండియాకు ‘కంగారు’ పెట్టిన భారీ స్కోర్.. భారత బ్యాటర్లపైనే ఆశలు.. రెండో రోజు ఆట వివరాలివే..

|

Mar 10, 2023 | 6:36 PM

కంగారుల తరఫున ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్ గ్రీన్ తమ సెంచరీలతో భారత బౌలర్లను బంతి కోసం పరుగులు పెట్టించారు. అలాగే చివర్లో వచ్చిన నాథన్‌ లియాన్‌ కూడా..

IND vs AUS 4th Test: టీమిండియాకు ‘కంగారు’ పెట్టిన భారీ స్కోర్.. భారత బ్యాటర్లపైనే ఆశలు.. రెండో రోజు ఆట వివరాలివే..
Ind Vs Aus 4th Test 2nd Day Score Details
Follow us on

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటయింది. ఈ క్రమంలో కంగారుల తరఫున ఉస్మాన్‌ ఖవాజా(180; 422 బంతుల్లో 21 ఫోర్లు), కామెరూన్ గ్రీన్ (114; 170 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీలతో భారత బౌలర్లను బంతి కోసం పరుగులు పెట్టించారు. చివర్లో వచ్చిన నాథన్‌ లియాన్‌(34; 96 బంతుల్లో 6 ఫోర్లు), టాడ్ మర్ఫీ(41; 61 బంతుల్లో 5 ఫోర్లు) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఆసీస్‌ను ఎట్టకేలకు ఆలౌట్ చేసిన టీమిండియా తరఫున అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. షమి 2, అక్షర్ పటేల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఇక క్రీజ్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ (17*), శుభ్‌మన్‌ గిల్ (18*) ఉన్నారు. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ కంటే భారత్ 444 పరుగులు వెనుకబడి ఉంది.

నిలబడితే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు ఉస్మాన్‌ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) రెండో రోజు కూడా చాలా సమయం పాటు చెలరేగిపోయారు. ఓవర్‌నైట్‌ స్కోరు 255/4 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడకుండా ఆడగలగడం గమనార్హం. ఈ క్రమంలోనే కామెరూన్ గ్రీన్‌ కూడా టెస్టుల్లో తన తొలి సెంచరీని భారత్‌పై సాధించాడు. ఇక వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 208 పరుగులను జోడించారు. అయితే రెండో సెషన్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ తన బంతితో విజృంభించడంతో గ్రీన్‌తోపాటు క్యారీ (0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన స్టార్క్‌ (6) కాసేపు అడ్డుగా నిలిచినా అశ్విన్‌ దెబ్బకు పెవిలియన్‌ చేరక తప్పలేదు. తొలి ఓవర్‌ నుంచి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించిన ఉస్మాన్‌ ఖవాజా కూడా.. మూడో సెషన్‌లో అక్షర్ పటేల్‌కు తన వికెట్‌ సమర్పించుకున్నాడు.

కాగా, అతని వికెట్ కోసం డీఆర్‌ఎస్‌కు వెళ్లి మరీ టీమిండియా ఆశించిన ఫలితం రాబట్టింది. అనంతరం వచ్చిన నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ కూడా భారత బౌలర్లతో ఆడుకున్నారు. టెయిలెండర్లుగా వచ్చినప్పటికీ తొమ్మిదో వికెట్‌కు 117 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే నాథన్ లియాన్, టాడ్ మర్ఫీని ఒక్క పరుగు తేడాతో పెవిలియాన్ బాట పట్టించాడు అశ్విన్. ఇక అనంతరం భారత్ తరఫున క్రీజులోకి వచ్చిన రోహిత్, గిల్ రెండో రోజు మొత్తం 10 ఓవర్లు ఆడి.. వికెట్ పడకుండా 36 పరుగులతో ఆట ముగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..