
Rohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (MI) పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒక వైపు వరుస ఓటములు, మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ సారథి రోహిత్ శర్మ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచులకు దూరమైన హిట్ మ్యాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే కీలక పోరులోనైనా ఆడతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. తన 39వ పుట్టినరోజు వేళ రోహిత్ మైదానంలో కనిపిస్తాడని ఆశించిన అభిమానులకు ముంబై మేనేజ్మెంట్ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
ఐపీఎల్ 2026 మధ్యలో రోహిత్ శర్మ హాంస్ట్రింగ్ గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. సుమారు 17 రోజుల నుంచి రోహిత్ మైదానంలో కనిపించలేదు. తొలుత ఇది చిన్న గాయమే అని మేనేజ్‌మెంట్ చెప్పినా, ఇప్పుడు ఏకంగా నాలుగో మ్యాచ్‌కూ అతను దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నా, మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నది ముంబై మేనేజ్‌మెంట్ తేల్చి చెప్పడం లేదు. బుధవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఆడటంపై నిర్ణయం టాస్ వేసే సమయంలోనే తీసుకుంటామని ముంబై వర్గాలు పేర్కొనడం అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది.
రోహిత్ లేకపోవడంతో ముంబై ఓపెనింగ్ జోడీ అస్తవ్యస్తంగా మారింది. హిట్ మ్యాన్ స్థానంలో వచ్చిన డానిష్ మాలేవార్ పరుగులను సాధించడంలో విఫలమవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. గత మ్యాచ్ లో చెన్నై చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పవర్‌ఫుల్ టీమ్‌ను ఎదుర్కోవాలంటే రోహిత్ అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ఒక వేళ రోహిత్ కూడా ధోనీలాగా యంగ్ స్టార్లకే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడా అని చర్చించుకుంటున్నారు.
ముంబైకి గాయాల బెడద ఇక్కడితో ఆగలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తన ఎడమ భుజం బెణకడంతో అతను ఇక ఆడలేడని వైద్యులు తేల్చారు. సాంట్నర్ స్థానంలో సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. సాంట్నర్ లాంటి ఆల్‌రౌండర్ లేకపోవడం ముంబై బౌలింగ్ విభాగంలో పెద్ద లోటు అనే చెప్పాలి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 7 మ్యాచుల్లో కేవలం 2 విజయాలతో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఇక మీదట ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. చిన్న పొరపాటు జరిగినా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఈ సారి లీగ్ దశలోనే ఇంటికి సర్దుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..