Rohit Sharma : ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ.. లార్డ్స్ వేదికగా మరో చారిత్రాత్మక ఫేర్‌వెల్ మ్యాచ్

Rohit Sharma : లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ చివరి వన్డే మ్యాచ్ ఆడనున్నాడనే వార్తలు క్రికెట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఝులన్ గోస్వామి బాటలోనే చారిత్రాత్మక ఫేర్‌వెల్ ఇవ్వనున్నాడా? అతని రికార్డులు, రిటైర్మెంట్ ఊహాగానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Rohit Sharma : ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ.. లార్డ్స్ వేదికగా మరో చారిత్రాత్మక ఫేర్‌వెల్ మ్యాచ్
Rohit Sharma

Updated on: Jul 17, 2026 | 4:19 PM

Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు అత్యంత షాకింగ్ న్యూస్. టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లోనే తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు, ఇప్పుడు అదే ఫార్మాట్ లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలై 19న క్రికెట్ మక్కాగా పిలవబడే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ భవిష్యత్తు జట్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రోహిత్ శర్మతో స్పష్టంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ రోహిత్ శర్మను దాటి ముందడుగు వేయాలని చూస్తోంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు వన్డేల్లో ఓపెనర్లుగా నిరంతర అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అంతేకాకుండా 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ రేసులో రోహిత్ శర్మను తాము పరిగణించడం లేదని సెలక్షన్ కమిటీ అతనికి ముందే స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ రోజు ప్రపంచ క్రికెట్ లో రోహిత్ శర్మ ఒక బ్రాండ్ నేమ్ అయినప్పటికీ అతని బాల్యం అంతా తీవ్రమైన పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య గడిచింది. రోహిత్ తండ్రి సంపాదన చాలా తక్కువగా ఉండటంతో.. అతను తన చిన్నతనంలో ఎక్కువ భాగం తాతయ్యలు, బాబాయ్ ల వద్దే పెరిగాడు. రోహిత్ లోని ప్రతిభను గుర్తించిన అతని చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ అతనికి ఎంతగానో సహాయం చేశారు. రోహిత్ శర్మ ఆర్థిక పరిస్థితిని చూసి క్రికెట్ అకాడమీలో అతని ఫీజును కూడా తగ్గించి ప్రతీ దశలోనూ వెన్నుదన్నుగా నిలిచారు. ఆ కష్టాల నుంచి వచ్చిన రోహిత్.. నేడు అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఓపెనర్ స్థానంలో రోహిత్ శర్మ మొదటి ఛాయిస్ గా ఉండకపోవచ్చు. అయితే రోహిత్ కు లార్డ్స్ మైదానంలో అంత మంచి రికార్డు లేదు. ఇక్కడ ఆడిన గత రెండు వన్డేల్లో ఒకసారి సున్నా పరుగులకే అవుట్ అవ్వగా, మరో మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు ప్రస్తుతం రోహిత్ తీవ్రమైన ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో 21 బంతుల్లో 11 పరుగులు చేసిన రోహిత్.. రెండో మ్యాచ్ లో 47 బంతులు ఆడి కేవలం 26 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

భారత మహిళల క్రికెట్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి కూడా తన కెరీర్ లోని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇదే లార్డ్స్ మైదానంలో ఆడి క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు అదే లార్డ్స్ మైదానం పురుషుల క్రికెట్ లోని మరో దిగ్గజ ఆటగాడైన రోహిత్ శర్మ ఫేర్‌వెల్ మ్యాచ్ కు వేదిక కానుండటం విశేషం. అయితే రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్ అవ్వకూడదని, అతను 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని అతని కోచ్ దినేష్ లాడ్ అభిప్రాయపడుతున్నప్పటికీ, సెలక్టర్ల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి.

రోహిత్ శర్మ వన్డే కెరీర్ ను పరిశీలిస్తే అతను ఒక లెజెండ్ అని చెప్పక తప్పదు. ఇప్పటివరకు తన కెరీర్ లో 287 వన్డే మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 279 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 11,757 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్ లో 33 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. తన కెరీర్ లో అత్యధికంగా శ్రీలంకపై 55 వన్డేలు, ఆస్ట్రేలియాపై 49 వన్డే మ్యాచ్ లు ఆడాడు. ఈ చారిత్రాత్మక రికార్డుల ప్రస్థానం జూలై 19 నాటి మ్యాచ్‌తో ముగిసిపోనుందా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us