IND vs AFG : ధర్మశాల వన్డేలో బిగ్ డ్రామా.. శుభ్‌మన్ గిల్‌పై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం

IND vs AFG : ధర్మశాల వన్డేలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య మిస్ కమ్యూనికేషన్ కారణంగా రనౌట్ డ్రామా చోటుచేసుకుంది. అయితే గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. రోహిత్ చారిత్రాత్మక రికార్డులు కూడా ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి.

IND vs AFG : ధర్మశాల వన్డేలో బిగ్ డ్రామా.. శుభ్‌మన్ గిల్‌పై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం
Rohit Sharma

Updated on: Jun 14, 2026 | 11:08 AM

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక ఊహించని డ్రామా చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ చేజింగ్ సమయంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఒక ఘోరమైన మిస్ కమ్యూనికేషన్ కారణంగా రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ఇద్దరూ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఈ ఊహించని సంఘటన జరగడంతో రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తితో, కోపంతో తల ఊపుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే?

అల్లా గజన్‌ఫర్ వేసిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ బంతిని మిడ్-ఆన్ వైపు నెట్టి సింగిల్ కోసం వేగంగా పరిగెత్తాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ బంతి ఫీల్డర్ చేతికి వెళ్లడం గమనించి గట్టిగా నో రన్ అంటూ పదే పదే అరిచాడు. కానీ అప్పటికే రోహిత్ శర్మ సగం కంటే ఎక్కువ పిచ్ దాటి ముందుకు వచ్చేశాడు. గిల్ అరుపులు విని రోహిత్ వెనక్కి తిరిగేలోపే అఫ్గాన్ ఫీల్డర్లు అప్రమత్తమై బంతిని వికెట్ కీపర్ వైపు విసిరారు. దాంతో రోహిత్ క్రీజులోకి చేరలేక కేవలం 16 పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. ఈ ఘోర తప్పిదంపై కామెంటేటర్ మురళీ కార్తీక్ స్పందిస్తూ.. ఇది ఇద్దరి మధ్య జరిగిన పూర్తి అవగాహనా లోపమని పేర్కొన్నారు.

రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డులు

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. అతను మైదానంలోకి అడుగుపెట్టడంతోనే రెండు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో భారతదేశం తరఫున ఆడిన అత్యంత వృద్ధ ఆటగాడిగా (39 ఏళ్లు) రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. దీనితో దాదాపు 37 ఏళ్ల నాటి మోహిందర్ అమర్‌నాథ్ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ సరసన రోహిత్ నిలిచాడు.

అఫ్గాన్ ఇన్నింగ్స్.. డెబ్యూ ప్లేయర్ల అద్భుత ప్రదర్శన

అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరి 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టుకు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగుల వీరోచిత సెంచరీతో భారీ స్కోరు అందించాడు. హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా రాణించడంతో అఫ్గాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లతో అఫ్గాన్ బ్యాటింగ్ లైన్‌అప్‌ను దెబ్బతీశారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు.

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ ఘన విజయం

రోహిత్ శర్మ రన్ అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. మొత్తం 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (34), చివర్లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఫినిషర్ పాత్రను పోషించారు. దీనితో భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us