Video: MI vs KKR పోరులో వింత ఘటన.. తొలి ఓవర్ వేసిన రోహిత్.. షాక్‌లో ఫ్యాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ బౌలింగ్ వేస్తున్నట్లు టీవీ స్క్రీన్‌పై కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ తమాషా నెట్టింట వైరల్‌గా మారింది.

Video: MI vs KKR పోరులో వింత ఘటన.. తొలి ఓవర్ వేసిన రోహిత్.. షాక్‌లో ఫ్యాన్స్?
Mi Vs Kkr Rohit Sharma Bowling

Updated on: Mar 29, 2026 | 9:06 PM

ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, తొలి ఓవర్ వేయడానికి స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సిద్ధమయ్యాడు. అయితే, లైవ్ టెలికాస్ట్ చేస్తున్న గ్రాఫికల్ స్కోర్‌కార్డులో బౌల్ట్ పేరుకు బదులుగా ‘రోహిత్’ అని దర్శనమిచ్చింది. బౌల్ట్ బంతిని విసురుతుంటే, స్కోర్ బోర్డులో రోహిత్ శర్మ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల పాటు సాగిన ఈ సాంకేతిక పొరపాటును బ్రాడ్‌కాస్టర్లు వెంటనే సరిదిద్దినప్పటికీ, అప్పటికే నెటిజన్లు దీనిని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు. ఐపీఎల్ వంటి భారీ టోర్నీలో ఇలాంటి లోపాలు అరుదుగా జరుగుతుంటాయి.

కోల్‌కతా భారీ స్కోరు..

మరోవైపు మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానె పాత రోజులను గుర్తు చేస్తూ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఫిన్ అలెన్‌తో కలిసి కేవలం 32 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలెన్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, రహానె మాత్రం క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానె తన ఇన్నింగ్స్‌లో క్లాసిక్ షాట్లతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు.

ముంబై బౌలర్ల తడబాటు.. శార్దూల్ మెరుపులు..

ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా తన తొలి ఓవర్‌లోనే 11 పరుగులు సమర్పించుకోగా, గజన్‌ఫర్ రెండు ఓవర్లలో ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు. అయితే, కష్టాల్లో ఉన్న ముంబైని శార్దూల్ ఠాకూర్ ఆదుకున్నాడు. కీలక సమయంలో ఫిన్ అలెన్‌ను అవుట్ చేయడమే కాకుండా, రూ. 30 కోట్లకు పైగా ధర పలికిన కామెరాన్ గ్రీన్ (18)ను కూడా పెవిలియన్ పంపాడు. వార్త రాసే సమయానికి కేకేఆర్ 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

వైరల్ అవుతున్న నెటిజన్ల రియాక్షన్లు..


రోహిత్ శర్మ బౌలింగ్ వేస్తున్నట్లు వచ్చిన గ్రాఫిక్ పొరపాటుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. “హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ఏదైనా చేస్తాడు” అని కొందరు, “రోహిత్ హ్యాట్రిక్ తీయడానికి రెడీ అయ్యాడు” అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, మ్యాచ్ ఆరంభంలోనే జరిగిన ఈ చిన్న లోపం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us