నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? బంగ్లా ప్లేయర్‌ కష్టానికి కరిగిపోయిన రోహిత్‌, షమీ! ఇంత మంచోళ్లేంటయ్యా మీరు..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గురువారం భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు ఆత్మవిశ్వాసం సంపాదించకుంది. గిల్‌ సెంచరీ, షమీ 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టారు. మరోవైపు బంగ్లాదేశ్‌ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 228 పరుగులు చేయగలిగింది.

నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? బంగ్లా ప్లేయర్‌ కష్టానికి కరిగిపోయిన రోహిత్‌, షమీ! ఇంత మంచోళ్లేంటయ్యా మీరు..
Ind Vs Ban

Updated on: Feb 21, 2025 | 11:21 AM

టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్లు తౌహిద్‌ హృదయ్‌, జాకర్‌ అలీ ఇద్దరూ 6వ వికెట్‌కు 154 పరుగుల భారీ భాగస్వామ్యంతో బంగ్లాకు ఫైటింగ్‌ స్కోర్‌ ఇచ్చారు. ముఖ్యంగా తౌహిద్‌ అయితే అద్భుతమైన సెంచరీతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఒక గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి 228కు చేరిందంటే అది తౌహిద్‌ పోరాటంతోనే. పైగా అంత సేపు ఎండలో బ్యాటింగ్‌ చేయడంతో అతని ఒళ్లు హూనం అయిపోయింది. ఎక్కడిక్కడ క్రామ్స్‌తో బాధపడుతూ.. అడుగుతీసి అడుగువేయలని పరిస్థితుల్లో కూడా జట్టు కోసం బ్యాటింగ్‌ చేసి, సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

ఇండియాకు వ్యతిరేకంగా ఆడుతున్నా కూడా టీమిండియా అభిమానులు కూడా అతను సెంచరీ చేయాలని కోరుకున్నారంటే అతని పోరాటం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. షమీ, హర్షిత్‌ రాణా నిప్పులు చెరుగుతున్నా, అక్షర్‌ పటేల్‌, జడేజా బాల్‌ను తిప్పేస్తున్నా కూడా వాళ్లకు ఎదురొడ్డి నిలిచి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తౌహిద్‌ సెంచరీ మార్క్‌ను దాడటంలో మాత్రం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్‌ మొహమ్మద్‌ షమీ హస్తం కూడా ఉంది. వారి మంచితనం కూడా తౌహిద్‌కు కలిసొచ్చింది. అది ఎలాగంటే.. సెంచరీకి దగ్గరవుతున్న కొద్ది తౌహిద్‌ క్రామ్స్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు. పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. తీవ్ర వేడి, చాలా సేపు గ్రౌండ్‌లో బ్యాటింగ్‌ చేయడం, ఎక్కువగా వికెట్ల మధ్య పరిగెడుతూనే రన్స్‌ చేయడంతో బాగా అలసిపోయాడు.

రన్‌ కోసం ఒక ఎండ్‌ నుంచి మరో ఎండ్‌కు వెళ్తూ కిందపడిపోతున్నాడు. పాపం అతని ఒంట్లో అసలు ఓపికే లేదు. అలా కిందా మీదా పడుతూ తౌహిద్‌ 99కి చేరుకున్నాడు. అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్‌ను అవుట్‌ చేయాలని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌, బౌలర్‌ షమీ అనుకోలేదు. అతను సెంచరీ పూర్తి చేసుకోవాలని వాళ్లు కూడా అనుకున్నారో ఏమో కానీ, 49వ ఓవర్‌లో అతను స్ట్రైక్‌లో ఉన్న సమయంలో రోహిత్‌ శర్మ ఆఫ్‌ సైడ్‌ పాయింట్‌లో అసలు ఫీల్డర్లను పెట్టలేదు. అలాగే షమీ కూడా పూర్తిగా ఆఫ్‌ సైడ్‌ డెలవరీలు రెండు వేశాడు. అది కూడా పూర్తి జోష్‌ పెట్టకుండా ఏదో పిల్లాడికి వేసినట్లు వేశాడు. అప్పటికీ తొలి బంతి వైడ్‌ వెళ్లింది రెండో బాల్‌ను కూడా అలాగే వేశాడు. దాంతో తౌహిద్‌ వెల్లగా దాన్ని టచ్‌ చేసి సింగిల్‌ తీసుకొని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్కడ సీన్‌ చూస్తూ పాపం క్రామ్స్‌తో తౌహిద్‌ షాట్లు ఆడలేదని, వికెట్‌ టూ వికెట్‌ వేస్తే లెగ్‌ బిఫోర్‌ అవుట్‌ అవుతాడని షమీ వైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ డెలవరీలు వేసినట్లు, అందుకోసమే రోహిత్‌ స్లిప్‌తో పాటు పాయింట్‌లో ఫీల్డర్లను పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు.

దీనిపై మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కామెంటర్లు కూడా మాట్లాడారు. ఏది ఏమైనా ఓ ఆటగాడి గొప్పతనం మరో ఆటగాడికే తెలుస్తుంది అన్నట్లు తౌహిద్‌ పోరాటానికి రోహిత్‌, షమీ తమ వంతు హెల్ప్‌ చేశారు. అయితే తౌహిద్‌ సింగిల్‌ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత టస్కిన్‌ స్ట్రైక్‌లోకి వచ్చిన తర్వాత షమీ ఫుల్‌స్పీడ్‌తో వికెట్‌, ప్యాడ్లను టార్గెట్‌ చేస్తూ బాల్‌ వేశాడు. అదే బాల్‌ తౌహిద్‌ వేసి ఉంటే అవుట్‌ అయ్యేవాడు. ఇలా రోహిత్‌, షమీ మంచి మనసుతో తౌహిద్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ పూర్తి చేసుకునే సమయంలో కూడా బంగ్లాదేశ్‌ బౌలర్‌ టస్కిన్‌, బాల్‌ త్రో వేయొద్దని ఫీల్డర్‌కు చెబుతున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్ఫూర్తిని చాటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..